
“దళిత”బంధుతో ఆర్థిక పరిపుష్టి
మీ సక్సెస్ తోనే ఇతరులకు లబ్ది
దళిత బంధు యూనిట్ల పరిశీలన
ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధు ఉపయుక్తంగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్. శ్రీనివాస్ అన్నారు. సోమవారం దళిత బంధు పథకం కింద నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన యూనిట్లను పరిశీలించారు. మినీ సూపర్ బజార్, బుక్ స్టాల్, మీ సేవా, క్లాత్ షోరూం, ఆప్టికల్ తదితర యూనిట్లను పరిశీలించారు. ఆయా లబ్దిదారులకు ఆయా యూనిట్ల ఆదాయ, వ్యయాలను నమోదు చేయాలని, లావాదేవీలను బ్యాంక్ ద్వారా చేపట్టాలని సూచించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు ఆయా యూనిట్లను సక్సెస్ గా నడిపించడంతో ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చన్నారు. దళితులను ఆర్థికంగా పటిష్ఠవంతం చేసేందుకు సీఎం కేసిఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలన్నారు. మీకు ఇష్టం వచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకుని వ్యాపార రంగంలో రాణించినప్పుడే సక్సెస్ మీ సొంతం అవుతుందని, మీ సక్సెస్ తోనే ఇతరులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజి లేకుండా రుణ బాధలకు తావివ్వకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఆయా లబ్దిదారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కు కోవాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల ఉజ్వల భవిష్యత్తుకు దళిత బంధు ఉద్దీపనగా నిలువనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఐ రాజు, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.