
*జర్నలిస్టుల సంక్షేమం* *టీయుడబ్ల్యుజె,ఐజేయూ* *లక్ష్యం*
*- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* *విరాహత్*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు.
కొంపల్లిలోని బతుకమ్మ టీవీ కార్యాలయంలో జరిగిన 2023 కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో దాదాపు 60 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగివున్న తమ సంఘం ఏనాడు, ఏ ప్రభుత్వానికి లొంగకుండా రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. జర్నలిస్ట్ సంఘాల పేరుతో నిన్న మొన్న పుట్టుకొచ్చిన కొన్ని దుకాణాలు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తూ మీడియా ఆత్మగౌరవాన్ని పాలకులకు తాకట్టు పెడుతూ పబ్బం గడుపుతున్నాయని విరాహత్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలైన జర్నలిస్టులు టీయుడబ్ల్యుజె-ఐజేయును మాత్రమే ఆదరిస్తున్న నిజం మొన్న హైదరాబాద్, నిన్న వరంగల్ లో జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల తీర్పుతో తేలిపోయిందని ఆయన అన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉచిత విద్య తదితర సౌకర్యాల కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బతుకమ్మ టీవీ యాజమాన్యం చేస్తున్న కృషిని విరాహత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.ఎల్.సి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొల్ల కిషోర్, డైరెక్టర్ కొల్ల కిరణ్, బతుకమ్మ టీవీ సీఇవో వీరాశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.