శిధిలావస్థలో కారుకొండ రైతు వేదిక! * నిరుపయోగంగా సముదాయం * ఫర్నిచర్ కు చెదలు * ఎండిపోతున్న మొక్కలు * దుమ్ము ధూళిలో సామాగ్రి * రక్షణ కరువు.. అలంకారప్రాయం * పట్టించుకోని మండల అధికారులు

శిధిలావస్థలో కారుకొండ రైతు వేదిక!
* నిరుపయోగంగా సముదాయం
* ఫర్నిచర్ కు చెదలు
* ఎండిపోతున్న మొక్కలు
* దుమ్ము ధూళిలో సామాగ్రి
* రక్షణ కరువు.. అలంకారప్రాయం
* పట్టించుకోని మండల అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తుంది. రైతులకు పంటలపై పలు సూచనలు చేసేందుకు పలు జిల్లాల్లో రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదికను నిర్మించి సిద్ధం చేయడం జరిగింది. ఏపీజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల కింద రైతు వేదిక భవనం నిర్మాణం కోసం 22 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో రైతు వేదిక భవనాన్ని పూర్తి చేయగా 08-04-2021న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వేదిక ప్రారంభించిన ఒకటి రెండు నెలల మినహా మిగతా నెలలో ఈ రైతు వేదికలో ఎలాంటి సమావేశాలు జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతు వేదిక భవనంలో రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల సముదాయంలో ఉన్న సామాగ్రి దుమ్ము ధూళి పట్టి దర్శనమిస్తుంది. ముఖ ద్వారం దర్వాజా చెదలు పట్టి కనబడుతుంది. అంతేకాకుండా మరుగుదొడ్లు సైతం నిరుపయోగంగా మారాయి. ఈ మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. ఈ రైతు వేదిక ఉన్న ఉపయోగం లేదని కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదిక ముందు వెనుక భాగంలో వేసిన మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ మొక్కలకు నీరు పోసే నాధుడే లేడు. రైతు వేదిక పరిసర ప్రాంతాల్లో మద్యం సీసాలు ఖాళీ ప్లాస్టిక్ గ్లాసులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రైతు వేదిక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు వేదిక సముదాయంపై పర్యవేక్షణ లేని కారణంగా ఇందులో కుక్కలు పందులు కూడా సంచరిస్తున్నాయి. గేట్ కి తాళం తీసి ఉండడం వల్ల ఇటు మందు బాబులకు అటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షలు తెచ్చి నిర్మించిన రైతు వేదిక అన్నదాతలకు ఉపయోగపడకపోవడం దారుణమని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులలో చిత్తశుద్ధి లోపం కారణంగానే ఈ కారుకొండ రైతు వేదిక ఉండి ఉపయోగం లేకుండా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నంత అధికారులు స్పందించి రైతు వేదిక భవనంలో రైతులకు సంబంధించిన సమావేశాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.