భాషా పండితులు,పీఈటిలకు పదోన్నతులు కల్పించాలని నల్లబ్యాడ్జిలతో ఉపాధ్యాయుల నిరసన
వరంగల్,అక్షిత బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో భాషా పండితులు, పీఈటీల పదోన్నతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పండిత ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా నగరంలోని 38 డివిజన్లో ఉన్న ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఖిలా వరంగల్ లో మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతం నాగరాజు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా భాషా పండితులు, పీఈటీలతో స్కూల్ అసిస్టెంట్ పనులు చేయిస్తూ అన్యాయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసేలా పోస్టులు అప్‌గ్రేడ్ చేస్తూ జీవోలు ఇచ్చినా వాటిపై కోర్టు కేసుల నెపం చూపిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్న యంత్రాంగం పండితులకు మాత్రం కోర్టు కేసు ఉందంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భాషా పండితులకు ఇచ్చిన హామీ కోర్టులో ఉన్నందున వారిని మినహాయించి పదోన్నతుల ప్రక్రియను ముందుకు సాగేలా నిర్ణయించడం సరైన చర్య కాదంటూ తెలుగు హిందీ ఉపాధ్యాయులు చీకటి సతీష్ గాయత్రి దేవిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తుది తీర్పునకు లోబడి భాషా పండితుల,పీఈటిల పదోన్నతులు కల్పించేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారమయ్యేలా చూడాలని లేని పక్షంలో పండిత ఐకాసా ఆధ్వర్యంలో దశల వారి నిరసనలు వ్యక్తం చేస్తామని తెలిపారు. వీరికి సంఘీభావంగా ప్రధానోపాధ్యాయులు శైలేంద్ర కుమార్, ఉపాధ్యాయులు సరోజినీ దేవి, రమాదేవి, ఇందిరా దేవి, జమున దేవి, రఘుపతి, కళ్యాణ్, శ్రీనివాసు పాల్గోని , ఇదే పదోన్నతుల షెడ్యూల్లో భాషాపండితులకు పదోన్నతులు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసారు..