రైతుల పక్షపాతి… కేసిఆర్

కేసీఆర్‌ను నిలువరించేందుకు మోడీ గ్యాంగ్‌ కుట్ర  మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోడీని కలవరపెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోడీ అండ్‌ గ్యాంగ్‌ సీఎం కేసీఆర్‌ను నిలువరింపజేసే కుట్ర చేస్తున్నది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలతో పాటు ప్రధానంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు అమలు చేసే 24 గంటల కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ మోడీ సర్కార్‌ను కలవర పెడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో మోడీ అండ్‌ కో సీఎం కేసీఆర్‌ను నిలువరించి ఈ పథకాలు ఆపివేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 27 ఏండ్లుగా గుజరాత్‌లో, 22 ఏండ్లుగా మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఎందుకు 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ చేస్తున్న దేశ ద్రోహం గురించి సీఎం కేసీఆర్‌ రెండు గంటల పాటు చెప్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు ఎందుక సమాధానం ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌ గురించి, ఇక్కడి పథకాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, దీనిపై ప్రశ్నిస్తారనే భయంతోనే ముఖ్యమంత్రిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 140 కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటూ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ అదానీ వంటి వాళ్లను పెంచితే.. ఆయన నిర్వాకం వల్ల రూ.15 లక్షల కోట్లు గంగ పాలైందన్నారు. అనంతరం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ రైతులకు ఇచ్చే 24 గంటల కరెంట్‌, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇతర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం, 46వేల చెరువుల పూడికతీత, 19లక్షల పంపు సెట్లకు 24 గంటల కరెంట్‌, రైతులకు పెట్టుబడి, రైతు బీమా, పంట కొనుగోళ్లు విధానం చూసి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మానే ఎంతో ఆశ్చర్యపోయి ప్రశంసించినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇలాంటి అభివృద్ధి ఎక్కడా చూడలేదని అన్నారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు,
రమావత్‌ రవీంద్రకుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్‌, షీప్‌ అండ్‌ గోట్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజు యాదవ్‌, ఆగ్రోస్‌ చైర్మన్‌ తిప్పన విజయసింహారెడ్డి, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకులు షేక్ మధార్ బాబా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking