అక్కన్న, మాదన్నలులా సాయన్న… గోపాల్

ఈ శతాబ్దపు అక్కన్న, మాదన్నలు

సాయన్న, ముఠా గోపాల్ స్నేహం అజరామరం

మనుషులు వేరైనా ఒకే ఆత్మగా జీవనం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఇద్దరిది ఒకే మాట… ఒకే బాట. ఇద్దరి జీవన పయనం అటు రాజకీయమైనా… ఇటు వ్యాపారమైన ఒక్కటే. నాడు తెలుగు దేశంలో (పసుపు దళం) రాజకీయ అరంగ్రేటం చేసిన…నేడు బిఆర్ ఎస్ (గులాబీ దళం)లో ఉన్నా…వీరి స్నేహ బంధం…పవిత్రం. కులాలు వేరే అయినా విడదీయరాని ఆత్మీయ బంధం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న… ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు  పవిత్ర స్నేహానికి ప్రతీక.

అనారోగ్యంతో సాయన్న ఆకస్మిక మరణం వీరిని భౌతికంగా విడదీసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మరణం పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినా, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివాసం ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని జవహర్ నగర్ కావడం ఒకటయితే, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో వీరిద్దరూ ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ కలిసే వ్యాపారాలు ప్రారంభించారు. కులాలు వేరయినా వీరి స్నేహం అజరామరంగా కొనసాగింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొంది, కొనసాగడం విశేషం. ఎమ్మెల్యే సాయన్న నివాసంలోని ప్రధాన హాల్లో వీరిద్దరికీ కలిపి ఒకే పూలదండ వేసిన ఫోటో ఎప్పుడూ చూసినా కన్పిస్తోంది. వీరిద్దరూ ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులని ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు.

అక్కన్న.. మాదన్నలుగా ప్రసిద్ది

స్నేహం గురించి కవులు చెప్పిన ప్రతి అక్షరానికి ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ పార్టీలో వీరి స్నేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తెగ మురిసేపోయేవారట. ఒకరకంగా చెప్పాలంటే భౌతికంగా వీళ్ల శరీరాలు వేర్వేరు కావొచ్చు కానీ, ఆత్మలు మాత్రం ఒకటేనంటూ ప్రముఖుల మన్నలను పొందారు.

అంతే కాదు, ఏ విషయంలోనైనా నిర్ణయం చెప్పాల్సి వస్తే ఒకే అభిప్రాయాన్ని చెప్పి మిగతా వారందరినీ ఆశ్చర్యపర్చేవారట. ఏ మీటింగ్ అయినా సరే ప్రజలు కూడా వీరిద్దరికీ కలిపి ఒకే పూల దండ వేసేవారట. దీంతో వీరి స్నేహబంధం ఎంతటి ఆత్మీయతను చాటుకుందో ఇట్టే తెలిసిపోతోంది. వీరిద్దరి స్నేహాన్ని చూసి ఆశ్యార్యానికి లోనైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోల్కొండ సంస్థానంలో తానీషా పాలనలో మంత్రులుగా కొనసాగిన అన్నదమ్ములు అక్కన్న, మాదన్నలుగా అభివర్ణించడం విశేషం. వీళ్ల గురించి తెలిసిన వారెవరైనా సరే అక్కన్న.. మాదన్నలుగానే సంబోధించేవారట. వీరిద్దర్నీ ఒకేసారి ఎమ్మెల్యేలుగా చూడాలని చంద్రబాబు ఆకాంక్షించారట. దీంతో వీరి స్నేహానికున్న ప్రాధాన్యతను, గొప్పతనాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఒకేసారి కార్పొరేటర్లుగా పోటీ చేసి..

1986లో ఎంసీహెచ్ ఎన్నికల్లో దోమలగూడ డివిజన్ నుంచి సాయన్న, జవహర్ నగర్ డివిజన్ నుంచి ముఠా గోపాల్ లు ఒకేసారి కార్పొరేటర్లుగా పోటీ చేశారు. కానీ, జవహర్ నగర్ నుంచి ముఠా గోపాల్ మాత్రమే గెలుపొంది, దోమలగూడ నుంచి సాయన్న ఓడిపోయారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్నకు రిజర్వు స్థానమైన కంటోన్మెంట్ నుంచి అవకాశం లభించడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి 6 సార్లు పోటీ చేసిన సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముషీరాబాద్ నుంచి బీసీ కేటగిరీకి చెందిన ముఠా గోపాల్ కు 2018లో అవకాశం రావడంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వీరిద్దరూ అదికార పార్టీ ఎమ్మెల్యేలుగానే  కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరూ ఒకేసారి ఎమ్మెల్యే కావాలనే కోరిక నెరవేరింది. ఇద్దరూ ఏకకాలంలో ఎమ్మెల్యేలుగా కొనసాగడం వీరి స్నేహాంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిగా చెప్పవచ్చు. ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత 2016లో కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేశారు. ఈ సమయంలో అన్నీ తానై చూసుకున్న ముఠా గోపాల్ సాయన్న కుమార్తె కార్పొరేటర్ గా గెలుపొందడానికి ప్రధాన భూమిక పోషించారు. ప్రాణానికి ప్రాణ స్నేహితుడు ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురికాగా, సాయన్నను పరామర్శించడానికి వచ్చినవారంతా వీరి స్నేహం గురించే చర్చించుకోవడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

Breaking