చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
వర్షాకాలంలో విద్యుత్ తో జాగ్రత్త
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్
అక్షిత ప్రతినిధి భూపాలపల్లి
వర్షాకాలంలో ఈదురుగాలులు,ఉరుములు, మెరుపులు,భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని భూపాలపల్లి జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
జాగ్రత్తలు తప్పనిసరి
తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన,వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకరాదని,తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించొద్దని చెప్పారు.ఇంటి వైరింగ్‌కు నాణ్యమైన ఎర్తింగ్ ఉండాలని,పాడైన వైర్లను వెంటనే మార్చాలని, విద్యుత్ మరమ్మతులు అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తోనే చేయించాలని సూచించారు.రైతులు మోటార్లు, స్టార్టర్లు,పంపుసెట్లను వినియోగించే ముందు వాటి భద్రతను పరిశీలించాలని, విద్యుత్ లైన్ల క్రింద ఇనుప పైపులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలి
వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, చేపల వేటకు విద్యుత్ వినియోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తిని నేరుగా తాకకుండా పొడి కర్ర, ప్లాస్టిక్ వస్తువుతో వేరు చేసి,వెంటనే వైద్య సహాయం అందించాలని సూచించారు.విద్యుత్ తీగలు తెగిపడినా,ఇతర లోపాలు కనిపించినా వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఎస్‌ఈ రమేష్ పేర్కొన్నారు.