రామన్నపేట రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
వలిగొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ సిరిగిరెడ్డి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక ద్వారా దిగుబడులు మెరుగుపడటంతో పాటు నష్టాలను కూడా తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, వ్యవసాయ అధికారి ఖాన్, మార్కెట్ డైరెక్టర్ సత్తయ్య, నాగు, అంజయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని నిపుణులు సూచించారు.