వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్ అక్షిత బ్యూరో:

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు .బుధవారం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో వర్షాల అప్రమత్తతపై అధికారులతో సమీక్షించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..భారత వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాడు బడిన ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, కమ్యూనిటీ హాళ్లను పరిశీలించి, ఎవరైనా అందులో నివసిస్తుంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.వర్షాల సమయంలో వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని సూచించారు. వరద నీటిలో ప్రయాణించడం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.అత్యవసర పరిస్థితులు మినహా భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగి పడిన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, అలాంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు నీటి మట్టాన్ని నిరంతరం గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. వాహనదారులు భారీ వర్షాల సమయంలో అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్త వహించాలని, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జిల్లా యంత్రాంగం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచిందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత శాఖల అధికారులనుసంప్రదించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేశారు.ప్రజల సహకారంతోనే వర్షాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్ ,జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీవోలు,జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking