గిరిజన మహిళల సాధికారతకు నాటు కోళ్ల పంపిణీ
మహిళలు ఆర్థిక ఎదుగుదలకు నాటు కోళ్లు పంపిణీ
కౌడిపల్లి, అక్షిత ప్రతినిధి:
గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం ఉపాధి, గ్రామీణ జీవనోపాధి బలోపేతమే లక్ష్యంగా మెదక్ జిల్లా కౌడిపల్లి బ్లాక్ పరిధిలోని హరిచంద్ తాండ గ్రామ పంచాయతీలో సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణ కేంద్రం (ఎస్బిఐ హెచ్ యు బి) ఆధ్వర్యంలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా ప్రాజెక్టు కింద విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వి ఎన్ ఆర్ వి జె ఐ ఈ టి సంస్థ పెరటి నాటు కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రాజెక్టు సహ ప్రధాన పరిశోధకులు రాము మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో పెరటి నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళలు అదనపు ఆదాయం పొందడంతో పాటు కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వి ఎన్ ఆర్ వి జె ఐ ఈ టి సంస్థ నిరంతరం అండగా నిలుస్తుందని, అవసరమైన శిక్షణ, సాంకేతిక సలహాలు, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.పెరటి కోళ్ల పెంపకం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఉపాధి మార్గమని, గ్రామీణ మహిళలకు ఇది ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో వీరేంద్ర గోపి, ప్రాజెక్టు సిబ్బంది డా. దత్తేష్, రాకేష్, రామకృష్ణ, గ్రామ సర్పంచ్ షాలిబాయి–రవీందర్, గ్రామ కార్యదర్శి సతీష్, గ్రామ పెద్దలు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.