దీనత్వం తొలగి.. ధీరత్వం తొణికిసలాట

 దీనత్వం తొలగి.. ధీరత్వం తొణికిసలాట

మంత్రి కేటీఆర్‌ 

సిరిసిల్ల, అక్షిత ప్రతినిధి :

కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే స్థాయికి చేరుకుంది. ఇది ముమ్మాటికి ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు. కేసీఆర్‌ మానవీయ దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దార్శనీక ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన.. వీటన్నింటి కలయిక అయిన తెలంగాణ మాడల్‌ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభం ఎదురైనప్పటికీ అన్నింటిని తట్టుకుని తెలంగాణ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలగిందన్నారు. సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకుసాగుతున్నామని అన్నారు.
అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ.. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందన్నారు. సుసంపన్నమైన వ్యవసాయానికి తెలంగాణ.. నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాల రైతాంగం తమ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితిని ఈ రోజు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చూస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు ఖర్చు చేయగా.. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసింది. రైతు స్వభావాన్ని నింపుకున్న కేసీఆర్‌ సుపరిపాలనలో రైతుల కండ్లలో దీనత్వం తొలగి.. ధీరత్వం తొణికిసలాడుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితి.. ఇలా లెక్కకు మించిన అద్భుతమైన పథకాలు, సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారని చెప్పారు.. దుక్కి దున్నింది మొదలు.. పండిన పంట కొనుగోలు చేసే దాకా అడుగడుగున రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపి.. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చిన నాయకుడు కేసీఆర్‌ అని గుర్తు చేశారు. సాగు జలాలు, భూగర్భ జలాలు అసాధారణంగా పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016లో ఉన్న 1,77,960 ఎకరాల నికర సాగుభూమి కాస్త 2,40,430 ఎకరాలకు పెరిగింది. రైతుబంధు పథకం ద్వారా సిరిసిల్ల జిల్లాలో పది విడతల్లో 1,33,658 మంది రైతులకు 1130 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో నేరుగా జమచేశాం. రైతులకు సుస్థిరమైన ఆదాయం రావాలి, మెరుగ్గా బతకాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్ర బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించుకున్నాం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు దాదాపు వెయ్యి ఎకరాల్లో 292 మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగుచేస్తున్నారు. అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాకముందు కేవలం 4200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 14 వ్యవసాయ గోదాములు ఆనాడు ఉంటే.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాములను సిరిసిల్ల జిల్లాలో నిర్మించుకున్నాం. తెలంగాణ ఏర్పడకుముందు జిల్లాలో 3 వ్యవసాయ కమిటీలు మాత్రమే ఉండగా.. రైతుల సౌలభ్యం కోసం మరో 5 కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల సర్దాపూర్‌ గ్రామంలో 20 కోట్లతో 25 ఎకరాల్లో సువిశాలమైన అధునాతన మార్కెట్‌ యార్డ్‌ నిర్మించుకున్నాం. రైతులు తాము పండించిన పంటను నేరుగా విక్రయించుకునేందుకు వీలుగా 5.15 కోట్లతో సిరిసిల్ల పట్టణంలో రైతు బజార్‌ నిర్మించుకున్నాం. రైతు బీమా పథకం ద్వారా సిరిసిల్ల జిల్లాలో 1803 రైతు కుటుంబాలకు రూ.90.15 కోట్లతో రైతు బీమా పరిహారం చెల్లించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించుకున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో గంభీరావుపేట మండలం నర్మాలలో 309 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking