బాలల హక్కులు, రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
రామన్నపేట, ఆగస్టు 4 అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ఆధ్వర్యంలో మంగళవారం బాలల హక్కులు, బాలల రక్షణ, బాలల సంక్షేమ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సురక్షిత వాతావరణంలో జీవించే హక్కు ఉందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణతో పాటు సమగ్ర అభివృద్ధి ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కులని పేర్కొన్నారు. పిల్లలపై ఎలాంటి హింస, వివక్ష, నిర్లక్ష్యం జరగకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాల నిషేధంపై మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందే వివాహం చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇటువంటి వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పిస్తూ 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని, బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు.
అనంతరం పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే చైల్డ్ హెల్ప్‌లైన్–1098 సేవల గురించి వివరించి, పిల్లలకు సంబంధించిన సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో 1098కు సమాచారం అందించవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కె. భార్గవి, మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు, స్కోప్ సంస్థ (ఎన్‌జీఓ) ప్రతినిధి బి. నరసింహరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

