అభ్యుదయ పథంలో తెలంగాణ
* క్షామం నుంచి సంక్షేమం వైపు
* తొమ్మిదేండ్లలో దేశమే గర్వించేలా అద్భుత ఫలితాలు
* తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి
కేసీఆర్ నేతృత్వంలో అధునాతన పంథాలో స్థానిక స్వపరిపాలన
* మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచేందుకు శక్తివంచన లేకుండా కృషి
* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం అభ్యుదయ పథంలో పయణిస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్షామం నుంచి సంక్షేమం వైపునకు శరవేగంతో అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. తొమ్మిదేండ్లలో దేశమే గర్వించేలా అద్భుత ఫలితాలను సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని అమరవీరుల స్థూపం వద్ద స్వరాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమకారులను ఎమ్మెల్యే స్మరించుకొని పుష్పాంజలి ఘటించారు. అనంతరం
స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు భాస్కర్ రావు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం అధునాతన పంథాలో స్థానిక స్వపరిపాలన కొనసాగిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. అప్పుల బాధతో రైతుల బలవన్మరణాల దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్నదాతలకు దన్నుగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఆచరణను చూసి దేశమే అనుకరిస్తోందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం దెబ్బతిన్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. ప్రతి ఎకరాకు రూ.10వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు.

రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యులు వీధినపడొద్దనే గొప్ప ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతుల పొలాలకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో రాష్ట్రంలో 7,778 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం ఉండేదని, గతేడాది నాటికి 17,234 మెగావాట్లకు పెరిగిందన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పోకడలను తెలుసుకునేందుకు వీలుగా రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని అన్నారు. వరి ఉత్పత్తిలో పంజాబ్ తో తెలంగాణ రాష్ట్రం పోటీపడుతోందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తితో దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివక్ష కనబరిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల , చనాకా తదితర ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం బహుళ దశల ఎత్తిపోతల పథకాన్ని మూడేండ్లలోపు పూర్తి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నదులు, వాగులు,వంకల పునరుజ్జీవనం కోసం రూ.3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వృద్ధులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు రూ.2016 పెన్షన్, దివ్యఅంగులకు రూ.3016, బీడీ కార్మికులకు, బోధకాలు బాధితులకు రూ.2016 పెన్షన్ అందజేస్తోందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల ద్వారా36.32 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం షాదీముబారక్, కళ్యాణాలక్ష్మీ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. పేదల ఆత్మ గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తోందన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా గతేడాది నాటికి 19,837 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసిందన్నారు.తద్వారా 2,34,836 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించి అనేక పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. దళితుల స్వావలంబన, సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల గ్రాంట్ అందజేయబడుతుందన్నారు. అంతేకాకుండా, దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యా రంగంలో వికాసం కోసం 978 గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1,25,000 ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కోసం ప్రభుత్వం 7,289 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసిందన్నారు. గొల్ల కురుమలకు 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్లు మంజూరు చేసిందన్నారు. వృత్తి పనులు నిర్వహించేవారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 10.17 లక్షల మంది మత్స్య కారులకు 25.782 కోట్ల మత్స్య సంపద సృష్టించిందన్నారు. నేతన్నలకు 5లక్ష బీమాతో పాటుగా నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ అందజేస్తోందన్నారు. 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథ పథకం దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు. ఈ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణను తెలంగాణ రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, నూకల హన్మంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు షేక్ మధార్ బాబా, మోసిన్ అలీ, ఏడు కొండల్, షోయబ్, తదితరులు పాల్గొన్నారు.