పల్లెల్లో మార్పు కోసమే పల్లె ప్రగతి
కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీలో “తెలంగాణ గ్రామ ప్రగతి దినోత్సవం” ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి లు అతిథిలుగా హాజరయ్యారు, వారిని గ్రామ ప్రజలు కోలాటలతో స్వాగతం పలికారు, అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశానికే రాష్ట్రం రోల్‌మోడల్‌లా నిలిచింది అన్నారు. పల్లెలు అద్దాల్లా మెరుస్తున్నయి. పాతగోడలు, పాడుబడిన బావులు పోయి సీ.సీ రోడ్లు, సీ.సీ కెమెరాలు కనపడుతున్నయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యుత్తు తీగల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాల్లో శుభ్రమైన నీరు. మిషన్ కాకతీయతో కళకళలాడుతున్న చెరువులు.. నిజమైన గ్రామస్వరాజ్యాన్ని సాధించి చూపించాయి. మన ఊరు రూపురేఖలు మొత్తం మారడానికి ఏకైక మంత్రం.. సూత్రం పల్లె ప్రగతి అని తెలిపారు,
కెసిఆర్ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పల్లెల్లో మార్పు కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నూతన గ్రామపంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దీనివల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికబద్ధంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల గుర్తింపు, ప్రజల సమస్యలన్నింటిని తీర్చేందుకు కృషి చేసేందుకు కొత్త చట్టం దోహద పడుతుందన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో 844 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను సమకూర్చడం జరిగిందన్నారు. వీటి వల్ల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 21 రోజుల పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 349 గ్రామ పంచాయతీలకు గ్రామ ప్రగతి కార్యక్రమం వల్ల నెలవారి నిధులు ఇవ్వడంతో నూతన గ్రామపంచాయతీలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాయని తెలిపారు. ఈనెల 19న హరితోత్సవం ఉంటుందని ఆరోజు మొక్కలను భారీ ఎత్తున నాటి వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. శ్రీనివాస్ నగర్ స్థాయి అవార్డు గెలుచుకోవడం గ్రామ పంచాయతీ పాలకవర్గం చిత్తశుద్ధికి నిదర్శనమని, వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, శ్రీనివాసనగర్ సర్పంచ్ భోగవెల్లి వెంకటరమణచౌదరి, అధికారులు శాలువాతో సన్మానించారు.అనంతరం పారిశ్యుద్ద కార్మికులను సన్మానించి దుస్తులను అందజేసారు. గ్రామ సర్పంచ్ భోగవెల్లి వెంకటరమణచౌదరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మీ, డీఈ వెంకటేశ్వర్రావు, ఎంపీవో వీరారెడ్డి, ఎంపీటీసీ ఇస్లావత్ సుజాత, ఉపసర్పంచ్ అచ్యుతరామయ్య, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.