★ అమరుల యాదిలో అఖండ జ్యోతి
★ 22న ప్రారంభించనున్న
ముఖ్యమంత్రి కేసీఆర్
★ ప్రతిష్ఠాత్మకంగా అమరవీరుల
స్మారక చిహ్నం నిర్మాణం
★ ప్రపంచంలోనే అతిపెద్ద
స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం
★ హైదరాబాద్‌లో మరో పర్యాటక
ప్రదేశంగా ప్రసిద్ధి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి… ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక అమరవీరుల స్మారకచిహ్నం. హైదరాబాద్ నడిబొడ్డున.. ఓ వైపు హుస్సేన్‌సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ నెల 22న ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ స్మారకానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితం కావటం దీని ప్రత్యేకత.
ఎన్నో విశేషాలు
————————-
3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం లోపల ఓ మ్యూజియంతోపాటు సుమారు 100మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో-విజువల్ హాలు, 650 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్‌తోపాటు ఇతర సౌకర్యాలు, 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉన్నది. భవనం నిర్మాణ వైశాల్యం(బిల్టప్-ఏరియా) 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్‌సాగర్ అందాలు, బుద్ధవిగ్రహం, బిర్లామందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.
అమరవీరుల స్మారకం ప్రాజెక్టు విశేషాలు
————————————-
★ ప్రాజెక్టు వైశాల్యం: 3.29 ఎకరాలు(13,317చ.మీ.లు)
★ నిర్మాణ వైశాల్యం(బిల్టప్ ఏరియా): 26,800చ.మీ.లు (2,88,461 చ.అ.లు)
★ మొత్తం అంతస్థులు: 6 (రెండు సెల్లార్లు కలిపి)
★ స్మారకం మొత్తం ఎత్తు: 54మీటర్లు
★ దీపం ఎత్తు: 26 మీటర్లు
★ స్టెయిన్‌లెస్ స్టీల్ క్లాడింగ్: 100 మెట్రిక్ టన్నులు
★ నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్: 1500 మెట్రిక్ టన్నులు
★ ప్రాజెక్టు వ్యయం: రూ.177.50 కోట్లు
★ పరిపాలనా అనుమతుల జారీ: జూన్ 17, 2017
★ పనుల ఒప్పందం: సెప్టెంబర్ 14, 2018
★ కాంట్రాక్టు సంస్థ: కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
★ కన్సల్టెంట్: ఎంవీ రమణారెడ్డి, తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్స్ ప్రై.లి.
★ దుబాయి నుంచి తెచ్చి ఇక్కడ అమర్చి
ఈ భవనం వెలుపల నిర్మాణం కోసం 3000 స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్లను ఉపయోగించారు. ఈ మొత్తం ప్లేట్ల బరువు సుమారు 100 టన్నులు. వీటిని దుబాయ్‌లో ఫ్యాబ్రికేట్ చేయించి ఇక్కడికి తరలించగా, సైట్‌పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేనివిధంగా అసెంబుల్ చేశారు. లోపలి గోడలు, స్లాబులకు మాత్రమే కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1200 టన్నుల స్టీల్‌ను వినియోగించారు.
వేడిలేకుండా ప్రత్యేక డిజైన్
—————————————-
అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీ.. ఈ క్రమంలోనే వెలుగుతున్న దీపం ఆకృతిగల నిర్మాణాన్ని సీఎంకేసీఆర్ ఎంపికచేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్‌సీ(ఫైబర్-రీయిన్‌ఫోర్స్ కాంక్రీట్) షీట్‌లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులులేని స్టెయిన్‌లెస్ నిర్మాణం
—————————————–
అమరుల స్మారకానికి సంబంధించి పాలిష్ చేయబడి ఉబ్బినట్లుగా ఉన్న బాహ్యభాగం పశ్చిమ చైనీస్ నగరమైన కరామేలోని ‘క్లౌడ్ గేట్’, చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి వుంటుంది. ఇది ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించే సంప్రదాయ మట్టి నూనె దీపాన్ని పోలి ఉండటం విశేషం. 161అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ఇది ‘క్లౌడ్ గేట్’ కంటే ఐదారు రెట్లు పెద్దది. ప్రపంచంలో ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం మరెక్కడా లేదు.
మరో పర్యాటక ప్రాంతంగా..
————————————–
హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చి హ్నం మరో పర్యాటక కేంద్రంగా మారనున్నది. ఓ వైపు అత్యంత ఆకర్షణీయ సచివాలయం, మరోవైపు, ఆహ్లాదకర హుస్సేన్‌సాగర్ పరిసరాలు, బుద్ధుని విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌కుతోడు అమరుల స్మారక చిహ్నం హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తెస్తుందనడంలో సందేహం లేదు.
ఏ అంతస్థులో ఏముంది….?
—————————————-
★ బేస్‌మెంట్-2 – 1,06,993 చ.అ వైశాల్యం. (175 ఫోర్ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్, లాంజ్, లిఫ్ట్, 3 లక్షల లీటర్ల సంప్)
★ బేస్‌మెంట్-1 – 1,06,993 చ.అ వైశాల్యం. (160 ఫోర్ వీలర్లు, 200 టూ వీలర్ల పార్కింగ్, లాంజ్ ఏరియా, డైవర్లు, సెక్యూరిటీ రూములు)
★ గ్రౌండ్ ఫ్లోర్- 28,707 చ.అ విస్తీర్ణం. (మెయింటనెన్స్ రూమ్‌లు, చిల్లర్ ప్లాంట్, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అవసరమైన ఏరియా, స్టోర్ రూమ్‌లు, కిచెన్, కోల్డ్‌స్టోరేజీ)
★ మొదటి అంతస్థు- 10,656 చ.అడుగులు. (మ్యూజియం, ఫొటో గ్యాలరీ, 70మందికి సరిపడా ఆడియో విజువల్ రూమ్, ఎస్కలేటర్)
★ రెండవ అంతస్థు – 16,964 చ.అడుగుల విస్తీర్ణం. (సుమారు 500 మంది సామర్ధ్యంగల కన్వెన్షన్ హాలు, లాబీ ఏరియా)
★ మూడవ అంతస్థు, టెర్రస్ ఫ్లోర్- 8095 చ.అడుగుల విస్తీర్ణం. (రెస్టారెంట్, ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియా)
★ మెజనైన్ ఫ్లోర్- 5900 చ.అడుగుల విస్తీర్ణం. (గ్లాస్ రూఫ్ రెస్టారెంట్, ఓవర్‌హెడ్ ట్యాంక్)
★ దీపం- కార్బన్ స్టీల్‌తో నిర్మాణం, 26 మీటర్ల ఎత్తు. గోల్డెన్ ఎల్లో కలర్, ఎక్స్‌టర్నల్ లైటింగ్
★ బేస్‌మెంట్-2 నుంచి నాలుగవ అంతస్థు వరకు మూడు లిఫ్టులు
22న స్మారకం ప్రారంభ కార్యక్రమ వివరాలు
——————————————–
★ సాయంత్రం 5.00.గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి 6000 మంది కళాకారులచే స్మారకం వరకు ప్రదర్శన
★ సాయంత్రం 6.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు.
12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ సమర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు.
★ అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అమరజ్యోతిని సీఎం
ప్రారంభిస్తారు.
★ ఆ తరువాత సభావేదికకు చేరుకుంటారు.
★ సభలో ప్రముఖ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ దేశపతి అమరులకు నివాళులర్పిస్తూ గేయాన్ని ఆలపిస్తారు.
★ సభలో 10,000 మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పిస్తారు.
అనంతరం సీఎం ప్రసంగం.
★ ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలకు సన్మానం.
★ 800 డ్రోన్లతో షో, అమరవీరులకు జోహార్ అనే అక్షరాలతో స్మారకంపై లేజర్ షో నిర్వహిస్తారు.