సాధించిoదేమి ?
సంబరాలెందుకు?
రుణమాఫీ జాడేలేదు
ప్రజాధనంతో గులాబీ ప్రచారం
బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డా. రాజు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రుణ మాఫీ హామీ ఐదేండ్లకు చేరువయ్యింది. రుణ మాఫీ జాడలేదు. దళితులకు ఇచ్చేది అటుంచి… ఎప్పుడో ఇచ్చిన భూములు లాకున్నావ్. సంబండ వర్గాలకిచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి సబ్బండ వర్గాల ప్రజల ఆశలను పాతర వేసిన కేసీఆర్ ఏమి సాధించారని ప్రభుత్వ సొమ్ముతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాడి రాజు ఆరోపించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు పుట్టల దినేష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏమి సాధించారని తెలంగాణ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ఉత్సవాలు జరుపుతున్నారని,తమవైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిన తరువాత అమరవీరులు గుర్తొచ్చారా ?ఇన్ని రోజులు ఎందుకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొలేదని విమర్శించారు. మీకు అమరవీరుల కుటుంబాలపై చిత్త శుద్ది ఉంటే ఇప్పటికైనా అమరవీరుల కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి కొటి రూపాయల ఆర్థిక సహాయం అందించి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అమరులు కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. చివరి రోజు అమరవీరుల దినోత్సవం జరిపి పదమూడు వందల అమరవీరుల త్యాగాలను అవమానించారని తీవ్రంగా విమర్శించారు.అమరులు పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణాలో అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ద్రోహులను తన క్యాబినెట్ లో పెట్టుకొని పాలన చేస్తూ లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఅర్ కుటుంబాన్ని చెంచల్ గూడ జైల్లో వేసి దోచుకున్న ప్రజాధనాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే కాసోజు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, మునుగోడు ఉపఎన్నికలో శ్రీకాంతాచారి త్యాగానికి గౌరవంగా అదే సామాజికవర్గానికి చెందిన ఆందోజ్ శంకరాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి విశ్వ బ్రాహ్మణులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన గొప్ప బహుజన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇన్నాళ్లు గుర్తుకు రాని బీసీలు కెసిఆర్ కి ఇప్పుడు గుర్తొచ్చారని, అన్ని నియోజకవర్గాలలో ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి కుందారపు రమేష్, అధ్యక్షులు గాలిబ్ తదితరులు పాల్గొన్నారు.