అమరుల యాది… అఖండ జ్యోతి

విద్యార్థుల బ‌లిదానాలు క‌లిచివేశాయి..

ఆ ప్రాణాల‌కు వెల క‌ట్ట‌లేం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థుల బ‌లిదానాలు త‌న‌ను క‌లిచివేశాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి ప్రాణాల‌కు వెల క‌ట్ట‌లేం అని కేసీఆర్ పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమ‌రవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. చాలా ఆవేద‌న క‌లిగించే విష‌యం ఏంటంటే.. ఒక ర‌క్త‌పు చుక్క కార‌కుండా.. ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా తెలంగాణ సాధించుకోవాల‌నుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.

కానీ నా నిరహారదీక్ష సంద‌ర్భంగా ఒక విచిత్ర‌మైన మ‌లుపు తీసుకుంది. ఆ మ‌లుపులో పిల్ల‌లు బ‌ల‌య్యారు. కేంద్రం క‌ళ్లు తెరుస్త‌దేమోన‌ని, మా ప్రాణత్యాగాల‌తోనైనా తెలంగాణ ఇస్తరేమోన‌ని వారు ప్రాణాలు త్యాగాలు చేశారు. ఆ ప్రాణాల‌కు వెల క‌ట్ట‌లేం. అందిన స‌మాచారం మేర‌కు ఆరేడు వంద‌ల మంది అమ‌రుల‌ కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కో కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌లు ఇచ్చాం. ఇల్లు లేని వారికి ఇల్లు కూడా ఏర్పాటు చేశాం. ఉన్నంత‌లో స‌హాయం చేశాం. ఇంకా ఎవ‌రైనా మిగిలి ఉంటే ఉదారంగా స‌హాయం చేసుకోవ‌చ్చు. దాంట్లో ఇబ్బంది లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

#యూనిక్‌గా క‌ట్టాల‌నే ఉద్దేశంతోనే కొంత ఆల‌స్యం..

విద్యార్థుల బ‌లిదానాలు చాలా బాధ‌పెట్టిన విష‌యం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను హింసించినా బాధ‌ప‌డలేదు. కానీ ఈ అనుహ్య‌మైన ఘ‌ట్టంలో బ‌లిదానాలు జ‌ర‌గ‌డం క‌లిచివేసింది. ఈ నేప‌థ్యంలో చాలా యూనిక్‌గా క‌ట్టాల‌నే ఉద్దేశంతో కొంత ఆల‌స్యం జ‌రిగింది. క‌ళాకారుడు ర‌మ‌ణారెడ్డి పిలిపించుకుని అమ‌ర‌వీరుల స్మార‌క కేంద్రం యూనిక్‌గా రావాల‌ని చెప్తే.. దీపం వెలుగుతున్న‌ట్లు డిజైన్ చేసి చూపించారు. చాలా ఖ‌ర్చు అని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ముందుకు వెళ్లామ‌ని చెప్పాను. చాలా స‌మ‌యం తీసుకుంటుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ, అయినా కూడా చేయండి అని చెప్పాను అని కేసీఆర్ తెలిపారు.

#అమ‌ర జ్యోతి వ‌ద్ద నివాళుల‌ర్పించాలి..

ఇత‌ర రాష్ట్రాల వారు, విదేశీ ప్ర‌తినిధులు వ‌చ్చినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఒక ఆచారం పెట్టుకుంటాం.. ఎవ‌రు వ‌చ్చినా స‌రే అమ‌ర జ్యోతి వ‌ద్ద నివాళుల‌ర్పించిన త‌ర్వాతే మిగ‌తా కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న చేస్త‌దని కేసీఆర్ తెలిపారు. ఈ స‌చివాల‌య ప్రాంగ‌ణంలో నిత్యం మ‌న‌కు స్ఫుర‌ణ వ‌చ్చేలా.. మ‌న అమ‌రుల జ్యోతి మ‌న కండ్ల‌లో ప్ర‌కాశిస్తూ ఉంటుంది. మొన్న మొన్న‌నే 125 అడుగుల ఎత్తులో భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప‌రిపాల‌న‌కు గుండె కాయ అయిన స‌చివాల‌యం, అమ‌ర‌జ్యోతి, డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాం. ప్ర‌పంచ‌మంతా శాంతి, కరుణ‌తో బ‌త‌కాల‌ని ప్ర‌వ‌చించిన‌టువంటి బుద్ధుని విగ్ర‌హంతో ఈ ప్రాంగ‌ణ‌మంతా ఒక యూనిక్ ప్లేస్‌గా, ఒక ల్యాండ్‌మార్క్‌లాగా ఈ ప్రాంతం త‌యారైంది అని కేసీఆర్ తెలిపారు.

ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం..

అమ‌రుల స్ఫూర్తి, ఉద్య‌మ సాధ‌న‌లో ప‌డిన శ్ర‌మ దాని యొక్క క‌సిని తీర్చుకుంటూ ఇవాళ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను కులం, మ‌తం, జాతి అనే బేధం లేకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌హాయం అందిస్తూ ప్ర‌భుత్వం ముందుకు పురోగ‌మిస్తున్నది అని కేసీఆర్ తెలిపారు. క‌చ్చితంగా ఇదే స్ఫూర్తితో నిరంత‌రం తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు పోతుంద‌ని రాష్ట్రాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తుంద‌ని మీ అంద‌రికీ హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking