*ప్రియాంకా గాంధీ పర్యటన మరో సారి వాయిదా
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ కొల్లాపూర్ పర్యటన మరోసారి వాయిదా పడింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో లాంఛనంగా చేరేందుకు ఉద్దేశించి భారీ బహిరంగసభను కొల్లాపూర్‌లో నిర్వహించాలని తొలుత ప్లాన్ చేశారు. ఆ ప్రకార ఈ నెల 20న సభ జరగాల్సి ఉన్నది. కానీ ఆమె విదేశీ పర్యటనతో పాటు ఆ తేదీల్లో ఆమె అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పలు చోట్ల వరదల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ మరోసారి వాయిదా పడింది. తదుపరి ఎప్పుడు నిర్వహించాలనేది ఖరారు కాలేదు. కానీ వచ్చే నెల పస్ట్ వీక్‌లో నిర్వహించడంపై కసరత్తు జరుగుతున్నది.
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదుపరి డేట్ పైన ఆమెతో సమన్వయం చేయనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా ఆమె పర్యటిస్తున్నందున ఫస్ట్ వీక్‌లో ఆమెకు అందుబాటులో ఉండే తేదీలను బేరీజు వేసుకుని కొల్లాపూర్ సభ డేట్ ఫిక్స్ అయ్యే అవకాశమున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపేలా గ్రాండ్‌గా సభను నిర్వహించాలని జూపల్లి భావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా జన సమీకరణపై కూడా దృష్టి పెట్టారు. వరదలు, వర్షాలతో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితితో పాటు ఆమెకు అందుబాటులో ఉండే తేదీలను సమన్వయించుకుని తదుపరి షెడ్యూలు ఖరారు కానున్నది.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడినందున కాస్త ఆలస్యమైనా పక్కాగా తేదీని ఫిక్స్ చేయాలని జూపల్లి సహా పీసీసీ చీఫ్ రేవంత్ భావిస్తున్నారు. ఫస్ట్ వీక్‌లో కుదరని పక్షంలో సెకండ్ వీక్‌లోనైనా ఆమెను కొల్లాపూర్‌కు ఆహ్వానించి మహిళా డిక్లరేషన్‌ను కూడా ఆమె చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ భావిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణుల్ని సన్నద్ధం చేసేలా రాష్ట్ర నేతలతో ఢిల్లీ నుంచి రేవంత్, ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సులో ప్రియాంకా సభ గురించి కూడా చర్చించారు. ఆమెతో మాట్లాడిన తర్వాత తదుపరి తేదీ ఖరారు కానున్నది.