నల్గొండ జిల్లాకు “సాగర్” వరప్రదాయిని

నల్గొండ జిల్లాకు
సాగర్ వరప్రదాయిని

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

నందికొండ, అక్షిత ప్రతినిధి :
సాగు నీటి ప్రాజెక్ట్ ల ద్వారా నీటి సామర్థ్యం పెరిగితే ఆయా ప్రాంతాలు అభివృద్ధిలో ముందు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ లోని విజయ విహార అతిధి గృహంలోని బోర్డు రూంలో నీటిపారుదల, ఆర్ డబ్ల్యుఎస్, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ, తదితర శాఖల ఇంజనీర్లు, అధికారులతో జిల్లాలో సాగు నీటి పారుదల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాకు నాగార్జున సాగర్ లాంటి బహుళార్థక ప్రాజెక్టు ఉండడం అదృష్టం అన్నారు. మన చరిత్ర చూసినట్లయితే నీటి వనరులు ఎక్కడ ఉంటాయో అక్కడే నివాస ప్రాంతాలు, అదేవిధంగా భూములను సాగు చేసుకుని జీవనాధారాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు.

అందులో భాగంగా ఈ జిల్లాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వలన భూములకు డిమాండ్ కూడా బాగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతము జిల్లాలో నీటిపారుదల శాఖలో ఎన్ని డివిజన్లు ఉన్నాయని ప్రశ్నించగా, మొత్తం 12 డివిజన్లు, 3 సర్కిల్స్ ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలో నూతనంగా 12 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేపట్టి నట్లు, వివిధ దశలలో పనులు ప్రగతి లో నున్నట్లు అధికారులు తెలిపారు. సాగు నీటి శాఖ ఆయా విభాగాల వారిగా ఇంజనీర్లను పరిచయం చేసుకొని వారి ప్రాంతానికి సంబంధించిన లిఫ్టు ఇరిగేషన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా భూసేకరణ సమస్యలు ఉన్న, అటవీ భూముల విషయంలో అభ్యంతరం ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. భూసేకరణ పై త్వరలో ఆర్డీవోలు, అటవీ,సాగు నీటి శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. నందికొండ మున్సిపాలిటీకి త్రాగు నీటి సరఫరా ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ వారే చూస్తున్నారు. దీనిని నందికొండ మున్సిపల్ కమిషనర్ త్రాగు నీటి సరఫరా స్వీకరించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కింద ఎన్ని ఎకరాలు సాగుతున్నాయని ప్రశ్నించగా, నల్లగొండ జిల్లాలో 70.3 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుందని, దీని ద్వారా ఒక లక్ష 46 వేల ఎకరాలకు నీరందిస్తున్నట్లు ఇంజనీర్లు కలెక్టర్ కు వివరించారు. నీటిపారుదల డివిజన్లో సర్కిల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మ్యాపులను పరిశీలించి అనేక విషయాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలివేషన్ మ్యాపుపై వివిధ నీటిపారుదల ప్రాజెక్ట్ లు పరిశీలించారు. జిల్లాలో ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల గురించి అడిగి, ఆ ప్రాంతాలలో ప్లోరైడ్ ప్రాబల్యం తగ్గించడానికి ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ సమావేశంలో సాగు నీటి పారుదల చీఫ్ ఇంజనీర్(ప్రాజెక్ట్స్) వి. అజయ్ కుమార్, హిల్ కాలనీ ఎస్ ఇ పి.వి.ఎస్ నాగేశ్వరరావు,మాల్ సర్కిల్ ఎస్.ఈ వెంకటేశ్వర్ రావు, హిల్ కాలనీ ఇఇ మల్లికార్జున రావు, వ్యవసాయ శాఖ జెడి సుచరిత, హార్టికల్చర్ అధికారి సంగీత లక్ష్మి, ఆర్ డబ్ల్యుఎస్ ఈఈ ముజీబుద్దిన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking