నాన్నపై ప్రేమతో 4 కుంటలు భూమి కబ్జా !

నాన్నపై ప్రేమతో
4 కుంటలు భూమి కబ్జా

*ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం

*బినామీ పేర్లతో అధికార పార్టీ అండదండలతో భూ దందాలు

*పేదలకు దక్కాల్సిన భూమిపై         కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఆయన ఓ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి భర్త .. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించాల్సిన నాయకుడు అతడు….. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు మేలు చేయాల్సిన ఆ నాయకుడు అవేమీ పట్టనట్లుగా అధికారం వచ్చాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు..ఆనాటి నుండి కంటికి కనిపించే అనేక దందాలకు తెరలేపి అక్రమార్జనకు శ్రీకారం చుట్టాడు.తన అక్రమ మార్గానికి కొంతమంది బినామీలను సృష్టించుకుని తన చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నేసి బిందాస్ గా దందాను మొదలుపెట్టాడు…. తనకున్న పలుకుబడితో పాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది బడా నాయకుల అండదండలతో యథేచ్ఛగా తన భూ దందాలు చేస్తూ నిజమైన పేదలకు, అర్హులకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను మాయం చేస్తూ అడ్డు వచ్చిన వారిని తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు మిర్యాలగూడకు చెందిన 6వ వార్డు కౌన్సిలర్ భర్త సాధినేని శ్రీనివాసరావు.

నాన్న పేరుతో 4గుంటలు ఖబ్జా !

మిర్యాలగూడ పట్టణ శివారు హైదలాపురం సమీపంలో గల 5 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు తన తండ్రి పేరుతో మొదటగా ఖబ్జాకు తెరలేపాడు. తన తండ్రి సమాధి నిర్మాణం కోసం ఏకంగా నాలుగు కుంటల విలువైన ప్రభుత్వ భూమిని ఖబ్జా చేసి దాని చుట్టూ పది అడుగుల ఎత్తున ప్రహరీ గోడను సైతం నిర్మించుకున్నాడు. అంతేకాకుండా సమాధి గోడలకు ఇరువైపులా మరొకరు రాకుండా తన బినామీల పేర్లతో దర్జాగా దాదాపు 55 గుంటల భూమిని ఖబ్జా చేశాడు. దాంతోపాటు మిగిలి ఉన్న భూమిని సైతం ఆక్రమించుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నా ఇదేమి అని అడిగే అధికారి లేకపోవడంతో పాటు అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నందున దేన్నీ వదలకుండా పేదలకు పట్టాల పేరుతో తన అనుకున్న బినామీలతో ఆక్రమణలు చేస్తున్నట్లు పలు ఆరోపణలు సైతం ఉన్నాయి.. అంతే కాకుండా ఇందిరమ్మ కాలనీలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన గల దాదాపు 20 కుంటల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సైతం ప్రారంభించాడు. అది కాకుండా సర్వే నెంబర్ 5 లో ప్రభుత్వ భూమి దాదాపుగా 6 ఎకరాలకు పైగా ఉండగా ఇందులో దాదాపు ఇతని ఖబ్జా సామ్రాజ్యంలో చేరింది..ఇంతగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న సదరు ప్రజాప్రతినిధిపై అధికారులు మాత్రం పట్టినట్లుగా వ్యవహరించడంలో ఉన్న నిగుడార్ధం అర్థం కావడం లేదు… ఎవరైనా భూ ఖబ్జాలపై సదరు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏదో తూతూ మంత్రంగా రావడం సర్వే చేయడం ఆ తర్వాత వదిలేయడం నిత్యకృత్యంగా మారింది.

*సెటిల్మెంట్ అంతా స్టేషన్ లోనే
సదరు వార్డు కౌన్సిలర్ భర్త

ఇందిరమ్మ కాలనీలోని చుట్టుపక్కల ప్రభుత్వ భూమిని ఎవరైనా ఖబ్జా చేస్తే వారిపై తన బినామీలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయిస్తాడు. ఆపై వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి భయపెడతాడు. ఆ తర్వాత పోలీసులతో మంతనాలు జరిపి వారితో ఒక సయోధ్య చేసుకుని అంతకుముందు ఖబ్జాలో ఉన్న వారికి అంతో ఇంతో ఇచ్చి ఆ భూమిని ఖబ్జా చేయడం ఇతని రోజువారి దినచర్యగా మారింది. ఇందులో పోలీస్ అధికారుల సైతం ఇతని ప్రలోభాలకు లొంగిపోవడం కొసమెరుపు.

ఆ వార్డ్ కౌన్సిలర్ భర్త దందాలకు అధికారులు సైతం వెనకడుగు

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు కబ్జాలకు పాల్పడుతున్న సదరు వార్డు కౌన్సిలర్ భర్త ఆగడాలకు అడ్డు వేయాల్సి ఉన్నప్పటికీ ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించడంలో ఉన్న పరమార్థం అర్థం కావడం లేదు. అధికారులు సైతం ఇతని బెదిరింపులకు లొంగిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. కంటికి ప్రభుత్వ భూములు ఖబ్జా చేస్తున్నట్లు కనబడుతున్నప్పటికీ ఇతనిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకడుగు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. కొంతమంది అధికారులు సదరు వార్డ్ కౌన్సిలర్ భర్త కబ్జా చేసిన భూమి పైకి వెళ్లి ప్రశ్నిస్తే వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు నుండి బడా ప్రజాప్రతినిధుల నుండి ఫోన్ రావడం ఆపై అక్కడి నుండి ఆ అధికారి వెళ్లడం జరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ భూ దందాలకు పాల్పడుతున్న సదరు ప్రజా ప్రతినిధి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking