జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలి

* కబ్జాదారుల నుండి
ప్రభుత్వ భూమిని కాపాడాలి

* అధికారులు, పాలకులు నిర్లక్ష్యాన్ని విడాలి

*చెవిలో పువ్వు పెట్టుకొని జర్నలిస్టుల ధర్నా

* మద్దతు తెలిపిన
అఖిలపక్ష నాయకులు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు వెంటనే ఇవ్వాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ జర్నలిస్టులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించగా సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, బిజెపి, టిడిపి, బీఎస్పీ, ఏఐఎఫ్బి, బిఎంపి ఇతర ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులకు సంఘీభావంగా మద్దతు తెలిపారు. కబ్జాదారు నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని, అధికారులు పాలకులు నిర్లక్ష్యం విడనాడి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని, ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ ఏఓ రాధకు వినతిపత్రం సమర్పించారు.

 

ఆగస్టు 15లోగా పట్టాలు అందజేయాలి
మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

నిత్యం సామాజిక బాధ్యతలు ప్రజాసేవలో ఉండే జర్నలిస్టు పట్ల అధికారులు పాలకులు నిర్లక్ష్యం వీడి ఆగస్టు 15లోగా ఇళ్లస్థలాల పట్టాలు అందజేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో కొంతమంది జర్నలిస్టులకు ఇలాంటి వివాదాలు లేని ఇంటి స్థలాలు కేటాయించాలని అదే మాదిరిగా ప్రస్తుతం జర్నలిస్టులకు వివాదాలు లేని ఇండస్థలాలను కేటాయించాలని కోరారు. పాలకులు, అధికారుల హామీ మేరకు ప్రభుత్వ భూమి గుర్తించి 10 లక్షలు ఖర్చు చేసి భూమిని చదును చేసుకుంటే అధికార పార్టీ నాయకులు ఇప్పుడు అడ్డుపడడం సరైనది కాదన్నారు. వారికి ఎలాంటి పత్రాలు లేకపోయినప్పటికీ అధికారులు పాలకులు వారికే వత్తాసు పలికి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులో న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

నాన్న పేరుతో 10 గుంటల భూమిని కబ్జా చేసిన గులాబీ నేత

కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి

నాన్న పేరుతో 10 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 10 ఫీట్ల ఎత్తు మేరకు ప్రహరీ గోడ నిర్మించారని కాంగ్రెస్ మున్సిపల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. విలువైన భూమిని కబ్జా చేసిన అధికారులు పట్టించుకోవడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రజల పక్షాన నిలబడే జర్నలిస్టులు ఇళ్లస్థలాల కోసం రోడ్ ఎక్కటం బాధాకర విషయం అన్నారు. గుండ్ల రాళ్లతో కూడిన ప్రభుత్వ భూమిని చదను చేసుకోమని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ కార్యకర్తలను అడ్డగించడం దుర్మార్గమైన చర్య అన్నారు దీనికి అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడి జర్నలిస్టులకు ఇళ్ల స్లాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మరో మూడు నెలలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు మంచి భూములను కేటాయిస్తామని చెప్పారు.

తక్షణమే జర్నలిస్టులకు
ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

సిపిఐ నేత బంటు వెంకటేశ్వర్లు

తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వ భూమిని చదును చేసుకుంటే ఆ భూమి వారికి దక్కకుండా తమ పార్టీ నాయకులతో అడ్డుపడేలా చేయడం సరికాదన్నారు. ఆగస్టు 15 లోగా జర్నలిస్టులకు ఇండస్థలాలు ఇవ్వకపోతే జర్నలిస్టులు చేపట్టే ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పారు.

బలమైన ఉద్యమాలు చేపట్టాలి

బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జె.రాజు

పేదరికంలో మగ్గుతున్న జర్నలిస్టులకు తక్షణమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, దీనికోసం బలమైన ఉద్యమాలు చేపట్టాలని డాక్టర్ జె.రాజు కోరారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేసి ఇళ్లస్థలాలను సాధించుకోవాలని దీనికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జర్నలిస్టుల ఆందోళనకు తమ పూర్తి మద్దతిస్తామని టిడిపి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము, ప్రజా సంఘాల నాయకులు సిద్దు నాయక్, పుట్టల దినేష్, ఎరుకల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు వజ్రగిరి అంజయ్యలు తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి సొంత పార్టీ కార్యకర్తలతో అడ్డుపడేలా చేయడం సరికాదన్నారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్ ఇతర నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఖాజా హామీదొద్దిన్, జర్నలిస్టులు ఆయూబ్, వెంకన్న, మహేష్, ఎండి అస్లాం, నజిమోద్దీన్, మంద సైదులు, వంశీ, భాస్కర్, మనోజ్, నరేందర్ రెడ్డి, నాగాచారి, రమేష్, గద్దల జయరాజు, అరుణ్, నాగరాజు, బండ వేణుగోపాల్ రెడ్డి, రమేష్ నాయక్, రామకృష్ణ, ఉమర్, రఫీ, నాగేందర్, శ్రీను, శ్యామ్, నర్సింహ, సైదులు, మహేష్, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉమా మహేశ్వర్, మాతంగి సృజన్ కుమార్, కందుకూరి జానకి రాములు, కట్ట బాబు, హరీష్ వినయ్, సాగర్, మధు, శ్రీను, బురహన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking