జాతిపిత ఆశయాలను సాధించాలి
* మహాత్ముడి అడుగుజాడల్లో నడవటమే నిజమైన నివాళి
* సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ సర్కార్ దూకుడు
* గాంధీ జయంతి వేడుకల్లో నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను సాధించేందుకు యువత కృషి చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కోరారు. ఆయన అడుగుజాడల్లో నడవటమే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా సాగర్ రోడ్డులోని మాహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆంగ్లేయుల బానిస, నిరంకుశ పాలన నుంచి అఖండ భారతావనిని విముక్తి కల్పించిన గొప్ప స్వతంత్ర్య సమరయోధుడు గాంధీ అని అన్నారు. సత్యం, అహింస, ధర్మం,శాంతియుత మార్గాల్లో నడిచిన బాపూజీ తన కలలను సాకారం చేసుకున్నారని అన్నారు. అంటరానితనం, కుల, మత వివక్షల్లేని సమాజస్థాపన కోసం కృషి చేశారని అన్నారు. సత్యం, అహింస అనే ఆయుధాలనే ఆయన నమ్ముకున్నారని చెప్పారు. సత్యాగ్రహం, సహాయనిరాకరణ అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి చెందుతుందనే సిద్ధాంతాన్ని గాంధీ నమ్మేవారని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల,పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ప్రతిఫలంగా ప్రతి ఏడాది స్వచ్చ్ భారత్ అవార్డులు వస్తున్నాయని అన్నారు. మహాత్ముడి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి తెలుసుకోవాలంటే గాంధీ ఆత్మకథ ‘ సత్యాన్వేషణలో నా ప్రయోగాలు’ అనే పుస్తకాన్ని యువత కచ్చితంగా చదవాలని భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.