చిన్న పత్రికలకు ఊపిరిలూదాలి
పెండింగ్ బిల్లులను
విడుదల చేయాలి
హనుమంతరావుకు దాస్ వినతి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆయా పత్రికల మనుగడకు ఊపిరిలూదాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ ఎం. హనుమంత రావును తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల, మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగి కోరారు. ఈ మేరకు ఆయా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సోమవారం నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావుకు పుష్పగుచ్ఛం అందించారు. చిన్న మధ్య తరహా పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల బిల్లులు ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని, ఆయా బిల్లులను వెంటనే విడుదల చేసి చిన్న పత్రికల మనుగడకు ఊపిరి ఊదాలని కోరారు.

ఆరేళ్లుగా 2018నుంచి అఫ్ గ్రేడ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నామని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు చిన్న మధ్య తరహా పత్రికల అఫ్ గ్రేడ్ ప్రక్రియ తక్షణమే చేపట్టాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అడహక్ బేసిక్ లో 2020 లో కొన్ని పత్రికలకు ఎంపానల్ మెంట్ జరిగిందని, పూర్తి స్థాయి ఎంపానల్ మెంట్ చేపట్టి, మూడేళ్లుగా నిరీక్షిస్తున్న ఆయా పత్రికలను ఎంపానల్ మెంట్ చేసి ఆదుకోవాలన్నారు. ఐఅండ్ పిఆర్ కమీషనర్ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 25 రోజుల అటెండెన్స్ ను పరిగణనలోకి తీసుకుని యాడ్ లు ఇస్తున్నప్పటికి వాటికి తోడు మునుపటి మాదిరిగా క్లాసిఫైడ్, ఎల్ ఏ యాడ్ లు ఇవ్వాలని, మ్యాగజైన్స్ కూడా ప్రతినెల యాడ్ లు ఇవ్వాలని కమీషనర్ దృష్టికి తెచ్చారు. ప్రతి నెల రెగ్యులర్ గా ఇచ్చే యాడ్ లను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ఐఅండ్ పిఆర్ కమీషనర్ అక్రిడిటేశన్ కార్డులు కల్గిన దిన పత్రికల ఎడిటర్లకు హైదారాబాద్ లో, మ్యాగజైన్స్ ఆయా జిల్లాలో ఇళ్ళ స్థలాలిచ్చి జర్నలిస్టులందరికీ గూడు కల్పించాలని విన్నవించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆదుకోవాలన్నారు.