కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ
* కోదండ రామచంద్ర స్వామి వారి నూతన ద్వజ స్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ మండలంలో తుంగపహాడ్ గ్రామంలోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి నూతన ద్వజ స్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ సర్కారు విశేష కృషి చేసిందని అన్నారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకున్నదని అన్నారు. దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. తొలుత 3వేల దేవాలయాలకు ధూప,దీప, నైవేధ్యాల కోసం నిధులను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా జీవో నెంబర్ 248 ద్వారా 2017, నవంబర్8 నుంచి 4,805 దేవాలయాలకు వర్తింపజేసిందన్నారు. ఈ పథకం ద్వారా బీఆర్ఎస్ సర్కార్ ప్రతి నెలా రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు మాజీ సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పున:నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులు చేపట్టారని అన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ, పాక్స్ చైర్మన్ శాగం ఆదిరెడ్డి, మాజీ సర్పంచ్లు సజ్జల శ్రీనివాస్ రెడ్డి, బారెడ్డి అశోక్ రెడ్డి, తుమ్మల ఫణి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల లక్ష్మయ్య, మచ్చ భరత్, చిన్న లింగయ్య, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.