ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్దిగా జెట్టి కుసుమ కుమార్‌

ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్దిగా జెట్టి కుసుమ కుమార్‌

-30 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ విదేయుడిగా పలు పదవులలో సేవలు

-గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా కుసుమ కుమార్‌కు గుర్తింపు

-ఖమ్మం ఎంపి సీటు కమ్మ సామాజీక వర్గానికే

-పార్లెమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సైతం తన సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణలోని 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పార్టీ నేతలు వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు పైగా గడువున్నప్పటికీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు.ఇదే సమయంలో పలువురు ఆశావహులు సైతం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఇప్పటికే సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి భంగపడిన నేతలు సైతం లోక్‌సభకు పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. కీలకమైన స్థానాల్లో తమదే టికెట్‌ అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు.తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఉంటుందనేది వాస్తవం. ప్రధానంగా సరిహద్దు జిల్లాలైన నల్గొండ ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉంటున్న సామాజిక వర్గాలు సైతం ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి.ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నేతలు ప్రభావం చూపుతుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం కమ్మ సామాజిక వర్గానిదే పై చెయ్యి. ఖమ్మం జిల్లాలో కీలకమైన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం గత ఎన్నికల్లో ఇదే విషయాన్ని పసి గట్టారు. అందుకు అనుగుణంగానే పావులు కదపడంతో కేవలం భద్రాచలం మినహా జిల్లాలోని అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయంపై ప్రస్తుతం విస్తృత చర్చ నడుస్తోంది.తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా భారీగానే ఉంది. అయితే కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానంగా నల్గొండ మహబూబ్‌నగర్‌ మల్కాజ్‌గిరి వంటి కీలక పార్లమెంట్‌ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైతం అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి లోపాయకారిగా మద్దతు ఇచ్చిన టీడీపీ ఆ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి కాస్త దూరంగా ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మాత్రం బీజేపీ అభ్యర్థులకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు టీడీపీ బీజేపీ కూటమి వైపు మళ్లే అవకాశం ఉందనేది వాస్తవం. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు తప్పవనే మాట బలంగా వినిపిస్తోంది. పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు కేటాయిస్తే తమకు అన్యాయం జరిగిందనే భావన కమ్మ సామాజిక వర్గానికి వస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సైతం ఏపీ తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు.

30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకీ సేవలందిస్తున్న కుసుమ కుమార్‌

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత గతంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పని చేసిన జెట్టి కుసుమ కుమార్‌ పేరును ఖమ్మం పార్లమెంట్‌ స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కుసుమ కుమార్‌ జిల్లాలో అన్ని వర్గాల నేతలతో సత్సంబంధాలున్నాయి.అదే సమయంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాహుల్‌ గాంధీ సోనియా గాంధీలతో నేరుగా మాట్లాడగలిగే నేతల్లో కుసుమ కుమార్ ఒకరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవడానికి కుసుమ కుమార్‌ తన వంతు కృషి చేశారు.వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి పేరుతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించిన వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి భట్టి సూచించిన వ్యక్తులకే టికెట్లు కేటాయించారు. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు నేతలకు కూడా కీలక పదవులు వచ్చాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సైతం వీరికే ప్రాధాన్యత ఇస్తే తప్పని సరిగా ఒక వర్గం నేతలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందనేది అగ్రనేతల మాట.

ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు నాలుగు తరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయులుగా జెట్టి కుటుంబం పని చేస్తోంది. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా కుసుమ కుమార్‌కు గుర్తింపు ఉంది. పార్టీలో కీలకమైన పదవులు నిర్వహించారు కూడా ఎన్ యస్ యుఐ యూత్‌ కాంగ్రెస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడిగా పార్టీ సూచించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు కూడా. విద్యార్థి దశ నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కుసుమ కుమార్‌ వైపు ప్రస్తుతం అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ, మహబూబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్‌కు కేటాయిస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినట్లుగా ఉంటుందని ఇప్పటికే పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సైతం పార్టీ పెద్దల దృష్టికి సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా తీసుకెళ్లినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking