విశ్వాసాన్ని కోల్పోతే మనుగడ* *అసాధ్యం*

*విశ్వాసాన్ని కోల్పోతే మనుగడ* *అసాధ్యం*

*-టీయూడబ్ల్యూజే అధ్యక్షులు* *విరాహత్ అలీ*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే మీడియా సంస్థలు సమాజంలో మనుగడ సాధించలేవని, ఇందుకుగాను ప్రజల ఆకాంక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ, నోరులేని గొంతుకలకు గొంతుకగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘పీపుల్ మీడియా పాయింట్’ ఛానెల్ లోగో, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నేడు సమాజంలో మీడియాపై రకరకాల చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి మీడియా సంస్థలు వెళ్లిపోవడంతో, సామాన్యులకు వార్తల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. యాజమాన్యాల వ్యక్తిగత ఎజెండాలు, ఆంక్షలతో జర్నలిస్టులు స్వేచ్ఛగా వారి భావాల్ని వ్యక్తం చేయలేక పోతున్నారని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవం కొనసాగడం శుభ పరిణామం అయినప్పటికీ, భావప్రకటన స్వేచ్ఛకు కూడా రాజ్యాంగంలో కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉన్నాయనే విషయాన్ని విస్మరించరాదని ఆయన సూచించారు. అసంఘటిత కార్మికుల గొంతుకగా ‘పీపుల్ మీడియా పాయింట్’ సంస్థ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం మంచి పరిణామమని ఆయన స్వాగతించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛానెల్ నిర్వాహకులు సంపత్ రెడ్డి, రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కిరణ్, కృష్ణ సాగర్, అసంఘటిత కార్మికుల ఉద్యమ నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking