టీయూడబ్ల్యూజే ( ఐజేయూ)లో చేరిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు
స్వాగతించిన జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు
కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టుల పక్షపాతిగా నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టీయూడబ్ల్యూజే-ఐజేయూ) పాటుపడుతుందని సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అన్నారు. ఆదివారం సూరారంలోని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 కి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆ సంఘానికి రాజీనామా చేసి టీయూడబ్ల్యుజేలో చేరారు. యూనియన్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కోటగడ్డ శ్రీనివాస్, పి సాయిబాబాలతో కలిసి ఆయన సభ్యత్వాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకమునుపు నుంచి జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తున్న సంఘం తమదేనన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సంక్షేమానికి మంచి రోజులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, ఇండ్ల స్థలాల కేటాయింపుకై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న జర్నలిస్టుల వివరాల సేకరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ ( హెచ్ఎంటీవీ), సాక్షి శర్మ, ఈటీవీ రమణ, టెన్ టీవీ ప్రవీణ్, టీవీ5 ప్రవీణ్, ఐ న్యూస్ భాస్కర్ రెడ్డి, బిఆర్ కే న్యూస్ సంతోష్, తదితరులు యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి శేషారెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు సూర్యనారాయణ రెడ్డి, నాగేంద్ర చారి, రాజు మన తెలంగాణ, లక్ష్మణ్, మల్లేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.