కల్తీకి విద్యార్దులు
బలవ్వాల్సిందేనా?
కల్తీకి కట్టడి లేదా?
విద్యార్థి సమస్యలపై పోరు
ప్రభుత్వ తీరుపై
మండిపడ్డ మహేష్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఫుడ్, నీళ్లు అన్నింటా కల్తీతో విద్యార్దులు బలవుతున్నా ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ, గురుకుల విద్యాలయాల్లో పురుగుల అన్నం, కల్తీ నీళ్లు తాగి విద్యార్దులు పిట్టలా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్ తో వివిధ సంక్షేమ హాస్టల్, గురుకుల విద్యాలయాల్లో వందలాది మంది విద్యార్ధిని, విద్యార్దులు ఆసుపత్రుల పాలవ్వడం… సరైన చికిత్స అందక అసువులు బాస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థిని, విద్యార్థుల ఆత్మహత్యలు, నగ్న పూజలు, అసాంఘిక కార్యకలాపాలకు కారకులు అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తు పొందుకుంటారని ఆశించిన తల్లి తండ్రులకు కంఠ శోకం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ వద్దే విద్యా శాఖ ఉన్నప్పటికి ఆయా పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించక పోవడందారుణమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో తగిన వసతి సదుపాయాలు లేక తల్లడిల్లుతున్నారని, ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటూ ఏడాది గడిచినా ఆయా సంస్థల్లో విద్యార్థులకు జరుగుతున్న అవస్థలకు పరిష్కారం లభించక పోవడం శోచనీయమన్నారు. ఇదిలా ఉంటే…విద్యార్థులకు మెస్ చార్జీలు, ఫీజ్ రియంబర్స్ మెంట్ పెంచక, విడుదల చేయక పోవడం విచారకరమన్నారు. విద్యార్దులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్నామని, హనుమకొండలో విద్యార్థులకు యుద్ధ భేరి చేపట్టి గొంతెత్తినప్పటికి ప్రభుత్వం సారించడం లేదన్నారు. ఆయా సమస్యల సాధనకు మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయికి కమిటీ వేసి వెంటనే చొరవ చూపాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈర్ల ప్రసాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మేడి నాగరాజు, జనరల్ సెక్రటరీ సతీష్, జాయింట్ సెక్రటరీ కూరెళ్ల ఉదయ్ కుమార్, అనిత, మమత, సరిత తదితరులు ఉన్నారు.