పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యం
– కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
–
– గ్రీన్‌వర్క్స్‌బయో ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పాలిమర్స్ ఆవిష్కరణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. గ్రీన్‌వర్క్స్‌బయో, సీఎస్ఐఆర్ – ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఉత్పత్తులను హైదరాబాద్‌లోని హబ్సిగూడ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమస్యలను ఎదుర్కొనడంలో విజ్ఞాన ఆధారిత పరిష్కారాలకు ఎంతో ప్రాముఖ్యత కలదన్నారు. సీఎస్ఐఆర్ – ఐఐసీటీతో గ్రీన్‌వర్క్స్ బయో సహకారం సాంకేతికత ద్వారా స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించే మా ప్రయత్నాలలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్, టెక్నాలజీ సామర్థ్యం ఎనలేనిదన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పచ్చదనం వైపుగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. గ్రీన్‌వర్క్స్‌బయో ఉత్పత్తులు ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా మన సామూహిక పోరాటంలో ముందడుగు అన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్‌వర్క్స్‌బయో డైరెక్టర్ రిషికా రెడ్డి మాట్లాడుతూ ఈ ఉత్పత్తులు ప్రపంచ ప్లాస్టిక్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఒక ముందడుగు అన్నారు. పర్యావరణ స్పృహతో నిర్ణయాలు తీసుకునేలా ప్రజలను శక్తివంతం చేస్తాయన్నారు. సీఎస్ఐఆర్ – ఐఐసీటీ సహకారంతో అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలలో సానుకూల మార్పును తీసుకురావడంపై ప్రభావం చూపుతున్నామని తెలిపారు. ఈ ఆవిష్కరణ ఒక గ్రీన్ వరల్డ్ సృష్టించడంలో మా నిబద్ధతకు నిదర్శనమన్నారు.