ఉజ్వల భవిష్యత్తుకై
ఆలోచనలుండాలి
ప్రముఖ మోటివేషనల్
స్పీకర్ సుధీర్ సండ్ర
ట్రపస, శ్రీ ఆద్య అకాడమీ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
మేడ్చల్, అక్షిత బ్యూరో :
చెడు వ్యసనాల వైపు పరుగులు తీయకుండా ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచనలను సాగించాలని ప్రముఖ సైకాలజిస్టు, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సండ్ర విద్యార్థులను కోరారు. తెలంగాణ గుర్తింపు పొందిన అపర్డబుల్ స్కూల్స్ అసోసియేషన్ (ట్రపసా) గ్రేటర్ కుత్బుల్లాపూర్, చింతల్‌లోని శ్రీ ఆద్య అకాడమీలు సంయుక్తంగా పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ శిక్షణను ఏర్పాటు చేశారు. సోమవారం గాజులరామారంలోని ఎస్‌జి కన్‌వెన్‌షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుధీర్ సండ్రతో పాటు సూరారంకాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, జీడిమెట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్, మండల విద్యాధికారి జెమిని కుమారిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల పలు అంశాలపై అవగాహన కల్పించారు.
55 పాఠశాలలకు చెందిన సుమారు 2200 మంది పదవతరగతి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ సండ్ర మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, సైనికులు, రైతులను మాత్రమే నిజమై హీరోలుగా గుర్తించి గౌరవించాలన్నారు.
సినిమాలలో నటించే హిరోలను తమ జీవితాలకు ఆదర్శంగా తీసుకోవద్దని సూచించారు. చెడువ్యసనాలకు లోనుకాకుండా ముందుకు వెళ్ళినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని తెలిపారు. పదవతరగతి, ఇంటర్మిడియెట్ కలిపి మూడు సంవత్సరాలు కష్టపడి చదువుతూ భవిష్యత్తుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే ఇక జీవితంలో మిమ్మల్ని ఎవరూ ఆపలేరన్నారు. జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ మత్తుపానీయాలు, డ్రగ్స్ మహమ్మారిలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. తరగతిలో ఉత్తమ విద్యార్థి అంటే అందరికి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమే కాదనీ, అన్ని కోణాల్లో విశ్లేషించుకునే శక్తిని పెంపొందించుకున్నవారే ఉత్తములని తెలిపారు. లక్ష్యాన్ని నిర్థారించుకొని దానిని సాధించుకునేందుకు ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. మండల విద్యాధికారి జెమిని కుమారి మాట్లాడుతూ పదవతరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం హర్షనీయమని నిర్వహకులను అభినందించారు. కుత్బుల్లాపూర్‌లో ఉత్తమ ఫలితాలను సాధించి మేడ్చల్ జిల్లాలోనే ఆదర్శవంతంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాక్షులు బిర్రు ఆంజనేయులు, శ్రీ ఆధ్య అకాడమీ కరస్పాండెంట్ విశ్వనాథ్ చారి, ట్రపస చైర్మన్ కోల వెంకటేశ్, అధ్యక్షులు వినోద్ జాదవ్, ప్రధానకార్యదర్శి దయాకర్, కోశాధికారి శ్రీశైలం, కార్యనిర్వాహక కార్యదర్శి మధుకుమార్ లతో పాటు కరస్పాండెంట్‌లు పాల్గొన్నారు.