మనసారా నవ్వేద్దాం.. చివరివరకు ఆరోగ్యంగా జీవిద్దాం…
నవ్వు ఆరోగ్యానికి నిధి లాంటిది.
నవ్వు బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్యౌషధం.
నవ్వు దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
నవ్వు మానవుడికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. భూమి మీద ఎన్నో కొట్లనుకోట్ల ప్రాణాలు ఉన్నప్పటికీ నవ్వడం ఒక మానవుడికి మాత్రమే వరంగా లభించింది. అందుకే మనసారా నవ్వేద్దాం… చివరి వరకు ఆరోగ్యంగా జీవిద్దాం… ఒక్కొక్క వ్యాయామం ఒక్కొక్క శరీర భాగాలకు మేలు చేస్తే.. నవ్వడం మాత్రం శరీరం లోపట ఉన్న అనేక అవయవాలను ఉత్తేజం కలిగించడంతోపాటు మనసును తేలిక పరుస్తుంది, మానసిక ఆనందాన్ని కలిగించడంతోపాటు ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తుంది. నవ్వడం అంటే పెదవులతో నవ్వడం కాదు. గట్టిగా నవ్వాలి, కడుపుబ్బేలా నవ్వాలి, కడుపు చెక్కలయ్యేలా నవ్వాలి, నవ్వితే కడుపు నొవ్వాలి, కండ్ల వెంట కన్నీరు రావాలి, చెంపలు, గదములు నొప్పి కలగాలి. నవ్వు పూర్వకాలంలో పౌరాణిక, జానపద చిత్రాలలో నటులు నవ్వినట్టు ఉండాలి. ఆ నవ్వే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఎలాంటి సందేహం లేదు. నవ్వడానికి సిగ్గు పడొద్దు, నాముషీగా భావించరాదు, నవ్వుల పాలవుతామని అస్సలు అనుకోవద్దు. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటేమో… నేడు నవ్వు 400 రెట్లు గ్రేటు అంటుంది ఆధునిక సమాజం.
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం..
ప్రపంచ నవ్వుల దినోత్సవం
ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. నవ్వు ద్వారా సోదరత్వం, స్నేహం విషయంలో ప్రపంచ చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవం ఉద్దేశించబడింది. ప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998, జనవరి 10న భారతదేశంలోని ముంబైలో జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు. మొదట జనవరి రెండవ ఆదివారం జరుపుకునే వారు కానీ, జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్య ప్రియులు కోరిక మేరకు లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దీన్ని మే మొదటి ఆదివారం కు మార్చి జరుపుకుంటున్నారు. అలా మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వ్యక్తులు తమను తాము మార్చుకోవటానికీ, ప్రపంచాన్ని శాంతియుతంగా, సానుకూలంగా మార్చడానికి అవసరమైన శక్తివంతమైన భావోద్వేగం నవ్వు ఒక్కటే. నవ్వు అనేది ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలపై, వారి భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయన్న ఉద్దేశ్యంతో మదన్ కటారియా నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించారు. నవ్వడమే ఏకైక లక్ష్యంగా
బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సమావేశాలు ఏర్పాటుచేసుకొని మనసారా నవ్వుకుంటున్నారు. నవ్వుల యోగా ఉద్యమం వల్ల 105కి పైగా దేశాలలో వేలాది లాఫ్టర్ క్లబ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ నవ్వుల పద్ధతులను నేర్చుకోవడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కమ్యూనిటీ సమూహాలలో చేరమని ప్రోత్సహిస్తున్నారు. 1998, జనవరి 11న ముంబాయిలో నిర్వహించిన మొదటి నవ్వుల దినోత్సవానికి 15వేలమంది హాజరయ్యారు.విదేశాల్లో 2000, జనవరి 9న మొదటిసారిగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హగన్‌లో నిర్వహించబడింది. సుమారు 25వేలమంది పాల్గొన్న ఈ ఉత్సవం గిన్నీస్ ప్రపంచ రికార్డులులో నమోదయింది.2004, మే 2న స్విట్జర్లాండ్ రాజధాని నగరంలో ఈ ఉత్సవంలో ఆ దేశ పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేశారు.
మందహాసం…
నవ్వు లేదా మందహాసం లేదా దరహాసం ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు.
నవ్వడం అంటే….
నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
తిక్కన సోమయాజి చెప్పిన నవ్వుల రకాలు
నవ్వులలో కొన్ని రకాలు ఆంధ్ర మహాభారంతో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ, 32 రకాల నవ్వుల గురించి చెప్పారు. మరింత సమాచారం మహాభారతంలో తిక్కన చెప్పిన నవ్వుల రకాలు తెలిపారు.
నవ్వుతో మరో ఏడేళ్ల ఆయుష్షు పెరుగుతుంది.
మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు.
నవ్వులో మరికొన్ని విశేషాలు
నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. (భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది.)నవ్వు వచ్చినప్పుడు ఒక జోక్ ని గాని, ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకుని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయగ్రహణం కి సంబంధించిన విషయం.నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచెయ్యాలి కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉంది.ఈ మూడు రకాల అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పనిచేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది. మనసారా నవ్వగలగడం అలవరచుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించు కున్నట్లే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికానందం, ప్రశాంతత ఏర్పడతాయి. చక్కగా నవ్వుతూండటం, నవ్వుతూ మాట్లాడే వారితో తోటివారు స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారు.నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎదుటివారిని హేళనచేస్తూ నవ్వడం, ఎదుటివారి నిస్సహాయతను చూసినవ్వడం, ఏదయినా తొక్కమీద కాలువేసి జారిపడినా, రాయి తగిలి జారినా వారిని చూసి నవ్వాపుకోలేకపోవడం, వికటాట్టహాసం, వక్రపునవ్వు, ఎదుటివారి అపజయానికి ఎద్దేవాగా నవ్వడంలాంటి నవ్వులు ఆరోగ్యకర మయినవి కావు. ఆ నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన ఎదుటివారు వారి స్వభావాన్ని చీదరించుకుంటూ వారికి దూరంగా తప్పుకుంటారు.
నవ్వువల్ల ఎన్నెనో ప్రయోజనాలున్నాయి.
ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించటానికి తోడ్పడుతుంది నవ్వు.
దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించి, స్ట్రెస్ హార్మోన్లు లెవెల్స్‌ను తక్కువచేసి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచు తుంది.
ముఖానికి చక్కని వ్యాయామం కలుగు తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్యౌషధంలా, చికిత్సగా పనిచేస్తుంది.
నోరంతా తెరచి నవ్వడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది.
ఉచ్ఛ్వాసనిశ్వాసాలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. హార్ట్‌రేట్ తగ్గుతుంది.
మనస్సులోని దిగులును, బాధలను మరపింపచేసి మనస్సును తేలికచేస్తుంది.
బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది.
నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయి.
ఏ విషయాన్నయినా బాధపడకుండా హాస్యంగానూ, తేలికగానూ, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం అలవడుతుంది.
నవ్వుతో సామెతలు
నవ్వు నాలుగు విదాల చేటు.
నవ్విన నాప చేనే పండుతుంది..
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు…
😊 లక్ష్యం ఏమిటి?
నవ్వు ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
ఒత్తిడి (స్ట్రెస్) తగ్గించడం
ప్రపంచ శాంతి, స్నేహాన్ని ప్రోత్సహించడం
ఆరోగ్య ప్రయోజనాలు
నవ్వడం వల్ల ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్) విడుదల అవుతాయి, రక్తపోటు తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మానసిక ప్రశాంతత కలుగుతుంది.
🎉 ఎలా జరుపుకుంటారు?
పార్కులు, పబ్లిక్ ప్రదేశాల్లో లాఫ్టర్ యోగా సెషన్లు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడం
నవ్వించే వీడియోలు చూడటం లేదా కామెడీ షోలు చూడటం
సోషల్ మీడియాలో నవ్వు ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడం
💡 ఆసక్తికర విషయం
నవ్వు ఒక సాధారణ మానవ భావన మాత్రమే కాదు, అది థెరపీలా కూడా ఉపయోగపడుతుంది (లాఫింగ్ తెరఫీ).
నవ్వును ఆస్వాదించండి
కష్టాలు, బాధలు మనసును చికాకు పరచడం, అసంతృప్తికి లోను చేయడం, భవిష్యత్తుపై ఆశలను సన్నగిల్లేల చేస్తాయి. అపజయాలను విజయాలుగా మలుచుకుని దారులను చూపించడంలో అవరోధాలను కలిగిస్తాయి. అందుకే కష్టాలను, బాధలను చూస్తూనే అవన్నీ మనుషులకే వస్తాయని అనుకుంటూ మనసు ఉల్లాసపరుచుకోవాలి, హాస్యపు జల్లును అందించే, పుస్తకాలను అన్వేషించాలి. నవ్వు దొరికే ప్రదేశానికి వేగంగా తరలి వెళ్లాలి. అప్పుడే భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తాయి. అపజయాలు విజయాలుగా మారుతూ మునుముందుకు వేగంగా పయనించేలా చేస్తాయి. బాధలు, కష్టాలు అత్యంత చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే నవ్వడం అలవాటు చేసుకోవాలి. నవ్వడం కోసం సాయంత్రమో, ఉదయమో కొంత సమయాన్ని కేటాయించి హాస్య ప్రియులను పోగు చేసుకుని నవ్వుకోవాలి.
చివరగా…..
రోజుకు కొంచెం నవ్వితే మన ఆరోగ్యానికి, మనసుకు చాలా మంచిది. “నవ్వు ఆరోగ్యానికి నిధి” అన్నది నిజమే 😊
బూరుగు వెంకటేశం,
హాస్య ప్రియుల వేదిక, రామన్నపేట.
నవ్వడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం..!
ఇది అతియశక్తిలాంటి నిజం..!! నవ్వే మీ ఆనందానికి నగ..!!!
సైన్స్ ప్రకారమైతే నవ్వు ఒక భావోధ్వేగం.. అని చెప్పొచ్చు. నవ్వుతో శారీరక, మానసిక ఆరోగ్యం ముడిపడి ఉంది అనేది అక్షర సత్యం. మెదడు, శరీరంలోని ఎక్కువ భాగాలు నవ్వులోని సమ్మిళిత కదలికలలో కలగలిసి ఉంటాయి. హాస్యం గానీ, హాస్యభరిత సన్నివేశాలు గానీ జరిగినపుడు యాదృచ్చికంగా అసంకల్పితంగా నవ్వు వస్తుంది. ఇది భావోధ్వేగంతో కూడిన స్వచ్చమైన, నిజమైన ఆనందానికి చిహ్నంగా చెప్పొచ్చు. నవ్వు మూలంగా ఇతరులతో ఏర్పడే సామాజికపరమైన సంబంధాలతో అనేక ప్రయోజనాలను పొందొచ్చు. మనసారా నవ్వినపుడు బిగుతుగా ఉండే శరీర కండరాలు సుమారు ఒక గంట వరకు వదులవుతాయి. రక్త నాళాల పనితీరు సక్రమంగా జరుగుతుంది తద్వారా గుండెపోటు వంటి జబ్బుల నుంచి బయటపడొచ్చు. అందుకే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం కోసమైనా నవ్వండి.. నవ్వుతూ ఉండండి.. నవ్విస్తూ హాయిగా, ఆరోగ్యంగా జీవించండి….
హాస్యం.. ఆరోగ్య భూషణం..!!!!
–పాల్వంచ హరికిషన్
సామాజిక కార్యకర్త
. రామన్నపేట
