పోరాటలతోనే…విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ

 

ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలి

మధురవాడ, అక్షిత న్యూస్ :

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచి ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయడం ద్వారానే ఇది రక్షించబడుతుందని జిల్లా సిపిఎం పార్టీ నాయకులు కె ఎమ్ శ్రీనివాస్ అన్నారు. నేడు కూర్మన్నపాలెం 86వ వార్డులో సఖీలా కూడలి వద్ద గల సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద 24 వ సిపిఎం పార్టీ మహాసభ సందర్భంగా జండా ఆవిష్కరణ, గోడపతులను ఆవిష్కరించారు. మార్కెట్లో కరపత్రాలను పంచారు.ఈ సందర్భంగా కె ఎమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా ప్రకటనల వరకే పరిమితమయ్యాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నది మరొకటిగా ఉందని ఆయన వివరించారు. నేటి వరకు ఉత్పత్తిని తగ్గించి ప్లాంట్ కు నష్టాలు కలిగించే విధంగా జరిగిందని, నేడు ప్లాంట్ లో ఉత్పత్తి తీస్తున్న పర్మనెంట్ కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రస్తావించడం కోసం ప్రధాన పరిపాలన భవనంలో దీనిపై ఎవరు స్పందించడం లేదని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలు ఈ పరిశ్రమపైనే ఆధారపడి తమ మనుగడ సాగిస్తున్నారని కనుక ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కోసం సిపిఎం పార్టీ జిల్లా 24 వ మహాసభలో తీర్మానం చేసి ప్రజా పోరాటాలకు తగిన ప్రణాళికను నిర్మిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా 28 వ తారీఖున జరిగే బహిరంగ సభ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం పార్టీ నాయకులు డి సిహెచ్ వెంకటేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దీనిలో సిపిఎం పార్టీ నాయకులు ఎం కృష్ణారావు, కె గంగాధర్, దత్తాత్రేయ రాజు, జి సూరిబాబు, గోపాలకృష్ణ రాజు, కృష్ణార్జున, అప్పారావు, ఎంవి రమణ, శివరావు తదితరులతో పాటు 86, 87 వార్డు సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking