దివ్యకారుణ్య తత్వాన్ని అలవర్చుకోవాలి

 

ప్రతి ఒక్కరూ దివ్యకారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలి

కర్నూలు బిషప్ గోరంట్ల జ్యానేష్ 

— లోక రక్షకుని బోధనలు నవవసంతాన్ని నింపుతాయి

ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్

 

కరుణగిరి పుణ్యక్షేత్ర వేడుకల్లో ఇద్దరు బిషప్ ల ఆధ్యాత్మిక ప్రసంగాలు

ముగింపు వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా హాజరైన భక్తజన సందోహం

ఖమ్మం, మార్చి 2 అక్షిత ప్రతినిధి :

సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్య కారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలని కర్నూలు బిషప్ జ్యానేష్ పిలుపునిచ్చారు. ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ సారధ్యంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మ్యాత్యూవర ప్రసాద్ రాజు పర్యవేక్షణలో ఆదివారం కరుణగిరి ప్రాంగణంలో కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవముల ముగింపు వేడుకలకు కర్నూలు బిషప్ జ్యానేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాన్ని అందించారు.

ఈ సందర్భంగా కర్నూలు బిషప్ జ్యానేష్ తమ సందేశంలో సమాజంలో మనుషులంతా తమ తోటి వారి పట్ల కరుణ, శాంతితో మెలగాలని కోరారు. ఏసుప్రభు చూపిన మార్గం ప్రతి ఒక్కరిని విశిష్ట మానవులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ఏసుప్రభు ఎన్నెన్నో శ్రమలను అనుభవించి లోకంలో సన్మార్గం వెల్లివిరియడానికి అహర్నిశలు నిర్వహించిన కృషి ఫలితంగా సజ్జన మనస్తత్వం పెరిగిందని తెలిపారు. ఖమ్మం మేత్రారాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ లోక రక్షకుని బోధనలు నవవసంతాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవనగమనంలో కరుణామయుని అచంచల కారుణ్యతత్వం ఉన్నత స్థితిలో నిలుపుతుందని తెలిపారు. కారుణ్య నాధుని ప్రాంగణంలో పుణ్యక్షేత్ర ఉత్సవాల్లో విశ్వాసం, ఆధ్యాత్మికత వెల్లి విరిసిందని అన్నారు. కరుణగిరి వేడుకల్లో నాలుగు రోజులుగా వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రం పట్ల తమ అచంచల విశ్వాసానికి ప్రతిబింబించారని వివరించారు. కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మ్యాత్యూవరప్రసాద్ రాజు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా కరుణగిరి ఉత్సవాలకు మహోన్నతమైన స్థానం ఉందని,ఈ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం కరుణగిరి క్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తుందన్నారు.

పండుగ సమిష్టి దివ్య బలి పూజ అనంతరం కర్నూలు బిషప్ జ్యానేష్ ను ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మ్యాత్యూవరప్రసాద్ రాజు, విజె శౌరి, ప్రోక్రాటర్ సూరేపల్లి ఐజాక్, చాన్సలర్ జర్నీస్ , మత గురువులు గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

కరుణగిరి ప్రాంగణంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవములు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. పురుషులకు, మహిళలకు నిర్వహించిన కోలాట పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking