సాగుకు నీటి కొరత లేదు

సాగుకు నీటి కొరత లేదు

దుష్ప్రచారాలను నమ్మవొద్దు
రైతులు ఆందోళన వద్దు
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ,ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. రబీలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని, రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఉదయ సముద్రం ప్రాజెక్టుల కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరతలేదని ఆమె తెలిపారు.
రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణ పై సోమవారం రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం ఆమె మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ,పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఇరిగేషన్, రెవిన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు.

ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 1.5 టిఎంసిల నీటికీ గాను 0.86 టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదలడం జరుగుతున్నదని, ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు ఈ నీరు సాగు బడికి వార బంది ప్రకారం పంట కోత వచ్చేవరకు ఇస్తామని తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఉదయ సముద్రం డి-40 కింద ఉన్న 11 -ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

అనంతరం మాట్లాడుతూ 11 ఎల్ కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరింకలపల్లి గ్రామాలన్నిటికీ వారబంది ద్వారా నీరు వస్తుందని, ఈ గ్రామాల తర్వాత కూడా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేందుకుగాను రెవెన్యూ ,ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా ఉదయ సముద్రం ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కింద నీటి కొరత గాని ,తేమ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఫిబ్రవరి నుండి ఎండలు తీవ్రమైన దృష్ట్యా కొంతవరకు నీరు తగ్గిన మాట వాస్తవమని ఆమె తెలిపారు. ఉదయ సముద్రం కు సాగునీటిని విడుదల చేసిన తర్వాత 30% భూగర్భ జలాలు పెరిగాయని అందువల్ల ఉదయ సముద్రం చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.

ఇరిగేషన్,పోలీస్ రెవిన్యూ, వ్యవసాయ అధికారులు అందరూ సాగునీటిని ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తున్నామని, ఏ ప్రాంతంలో ఎంత నీటిని ఇవ్వాలనే విషయంపై ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు ,ప్రజలు విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేశామని, వ్యవసాయానికి సంబంధించి సాగునీరు ,తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే పిర్యాదులు సమర్పించవచ్చని, తక్షణమే సంబంధిత శాఖల అధికారులు వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నకిరేకల్, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాలలోని కెనాల్స్ ద్వారా సాగు చేసే భూములకు ఎలాంటి సాగునీటి కొరతలేదని, 10 రోజుల్లో ఇక్కడ కోతలు కూడా పూర్తికానున్నాయని, అయితే దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలలో సాగు చేస్తున్న వేరుశనగ పంటలు ఆలస్యంగా సాగు చేశారని, అక్కడ కూడా పంటలు ఎండిపోకుండా రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉదయ సముద్రం ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking