యువత మార్గదర్శకత్వం-నూతన ప్రపంచ నిర్మాణం

యువత మార్గదర్శకత్వం-నూతన ప్రపంచ నిర్మాణం

 2006 లోనే చదివే అలవాటును గుర్తించిన గుండ్రాంపల్లి యువకులు
 20 ఏళ్లుగా కొనసాగుతున్న గ్రంధాలయ సేవలు
 మరిన్నిగ్రామీణ గ్రంధాలయాల ఏర్పాటుకు నాంది
సాంకేతికత తో పాటు పరిశోధన గ్రంధాలయంగా ఎదుగుతున్న గ్రంధాలయం

చిట్యాల, అక్షిత ప్రతినిధి :

ప్రపంచీకరణ ఈరోజుల్లో పాదరసంలా నడుస్తుంది అంటే పుస్తకాలను సాధనంగా మార్చుకోవడం ద్వారానే. పుస్తకాల జ్ఞాన భాండాగారంతో వివిధ దేశాల సంస్కృతి, విజ్ఞానం, ఆలోచన విధానాలను అన్వేషించి వాటిని ఆధారంగా చేసుకుని అణువులతో అంతరిక్షాన్ని చేదిస్తున్నాం.
విద్య అనేది ప్రాథమిక హక్కు. విద్యతో వినయం, వినయంతో జీవన వికాసం జరుగుతుంది. జ్ఞానానికి పునాది జిజ్ఞాసతో మొదలవుతుంది. జ్ఞానం అనేది నేడు మనం చూసే, చదివే అకాడమిక్స్ మాత్రమే కాదు. వాటితో పాటుగా నీలో ఉన్న కళను గ్రహించి ఆ కళలో నీవు ప్రావీణ్యం పొంది, నలుగురికి ఉపయోగపడేలా చేయడమే నిజమైన జ్ఞానం.
” భౌతిక సుఖం కన్నా సమాజ సౌఖ్యం చాలా మంచి ఆలోచన” ఇది కేవలం విద్యతోనే సాధ్యం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన విద్యకు నేటి విద్యా వ్యవస్థ ఏ విధంగా దోహదపడుతుంది? బ్లడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కి విలువ ఇస్తుందా? లేక ఫుడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కి విలువ ఇస్తుందా? నిజమైన సంస్కారాన్ని నేర్పి ఆకాశంలో నిలబెడుతుందా?లేక మిడిమిడి జ్ఞానంతో అథ: పాతాళానికి పంపుతుందా?


ప్రపంచీకరణ,పురోగతి అనే శబ్దాలు వినగానే మన జీవన చక్రాన్ని నెమరు వేసుకోవాలి. నేను ఏ విధమైన విద్యను అభ్యసించాను? ఏ విధమైన విద్యను అభ్యసిస్తున్నాను? ఆ విద్య నాకే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలు మొదలు కావాలి ముఖ్యంగా యువతలో. ఎందుకంటే యువతతోనే దేశం ” కొండలను బండలు చేసే వయసు యుక్త వయసు ” . ఒకానొక సందర్భంలో వివేకానందుడు ఇలా అనెను.” నాకు వందమంది ఉత్సాహకరమైన యువకులను ఇవ్వండి నేను భారతదేశాన్ని మారుస్తాను “అని. అంటే యువకులలో ఎంత శక్తి దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

కానీ,మారుతున్న రోజులతో జీవితాలు అన్నీ ఉరుకులు పరుగులుగా మారిపోయాయి. అందులోనూ ముఖ్యంగా ఆలోచించే అంశం అభివృద్ధి చెందుతున్నానా?లేక అభివృద్ధి చెందిస్తున్నానా?
మొదటిది అభివృద్ధి చెందుతున్నాను అంటే అది కేవలం నీ స్వార్థకాంక్షనే కానీ, అభివృద్ధి చెందిస్తున్నాను అంటే అది నీ నిస్వార్థకాంక్ష.ఏనాడు అయితే యువతలో నిస్వార్థకాంక్ష మొదలవుతుందో ఆ రోజే ప్రపంచీకరణ మొదలవుతుంది.పురోగతి మొదలవుతుంది.

ప్రపంచీకరణ అంటే గుర్తొచ్చే మరో అంశం టెక్నాలజీ. ప్రపంచమంతా టెక్నాలజీతో ముందుకు వెళుతుంటే అందులో కొంత శాతం యువత మాత్రమే ఉంది అంటే మిగతా యువత ఎందుకు లేదు? దానికి కారణం ఈజీ ఈజీ అంటూ లేజీగా మారడం మాత్రమే. పెరిగిన టెక్నాలజీ తో ఇతర గ్రహాలకి వెళ్తున్నాం అని ఆనందపడటంతోనే వాళ్ళ ప్రయాణం ముగుస్తుంది. ఎప్పుడైతే ఆ టెక్నాలజీని నేను ఎందుకు అభివృద్ధి చెందించలేదు అనే ప్రశ్నతోనే ఆ కొంతమంది ప్రయాణం మొదలవుతుంది.
టెక్నాలజీ అని టాలెంట్ లెస్ గా…
ఫ్యాషన్ అంటూ ఫకీర్లుగా…
ట్రెండింగ్ అంటూ తెలివి లేనివాడిగా…
బ్రాండ్ అంటూ బ్రెయిన్ లెస్ గా…
స్మార్ట్ వర్క్ అంటూ బద్దకృష్టులుగా…
అప్డేట్ అంటూ అందవిహీనులుగా…
మారకుండా ఉండాలంటే “పుస్తకం చేత పట్టు ప్రయత్నంతో మజిలీ మొదలు పెట్టు ” నీ జ్ఞానంతో జనులలో జ్ఞానం నింపు నిజమైన అభివృద్ధిని సృష్టించు ప్రపంచీకరణకు సరికొత్త నిర్వచనం రచించు.

 

 

ఆ అభివృద్ధిలో భాగంగానే నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదిన గ్రామం. తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తిని చాటిన నేల గుండ్రాంపల్లి గ్రామం. అభివృద్ధికి పునాది ఒక పుస్తకం అని భావించి, గ్రామ పంచాయతీకి వచ్చే ఒకే దినపత్రిక దాన్ని చదివే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తాము పడ్డ కష్టాన్ని తమ తర్వాత తరం వారు పడకూడదని భావించి తోటి సన్నిహితులను ప్రేరేపించి 24 మంది స్నేహితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ సహకారంతో ఒక గ్రంధాలయం ఏర్పాటుకు నాయకత్వం వహించాడు అనుముల శ్రీనివాస్

14 ఏప్రిల్ 2006లో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఆనాటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణ్ రావు ,ప్రొఫెసర్ చంద్ర శేఖర్ రావు ,టి వి ప్రఫుల్ల చంద్ర ,స్థానిక సర్పంచ్ చెరుకుపల్లి చంద్రయ్య మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
నాడు 11 దిన,వార, మాసపత్రికలతో ప్రారంభమై నేడు 25 పత్రికలతో ముందుకు సాగుతుంది. అదేవిధంగా పరిశోధనలు చేసేవారు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సులభంగా ఉండడం కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచి ఆ గ్రామంతో పాటు చుట్టూ ఉన్న ఆరు గ్రామాలకు ఉచిత సేవలను అందిస్తున్నారు.
గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించబడుతుంది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి సెలవులు కూడా సద్వినియోగం చేసుకునే విధంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా చిత్రలేఖనం ,కథలు రాయడం ,కథలు చెప్పడం, తెలుగు ,ఇంగ్లీష్ మరియు గణితం నేర్పిస్తూ, అప్పుడప్పుడు గ్రామ ప్రజలకు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.పుస్తక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా పాఠకులలో మరింత ఆసక్తి పెరుగుతుంది.
నాటి నుండి నేటి వరకు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా మారింది గుండ్రాంపల్లి మరియు ఎంతో మంది యువకులకు మార్గదర్శనం అయ్యారు ఈ గ్రామ యువకులు.
20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గుండ్రాంపల్లి గ్రంధాలయ నిర్వహణ కమిటీ కి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రపంచీకరణలో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking