నీకింత… నాకింత !
కాసులిస్తే.. ఇంటి నెంబర్లు ?
చక్రం తిప్పిన బిల్ కలెక్టర్
దుండిగల్ మున్సిపల్
అధికారుల తీరు
మున్సిపల్ నోటీస్ బోర్డ్ లో మాత్రం ఇంటీ నెంబర్లు నోటరీలపై గ్రామకంఠంపై ఇవ్వబడదు అని పేరుకేనా..?
కాలి జాగాకు, ఫ్రీ కాస్ట్ వాలుకు అస్సెస్మెంట్లు..ఇంటి నంబర్ల కేటాయింపు..
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ కాంగ్రెస్ నేతకు అనుకూలంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులు సిబ్బంది..
చెరువులు కుంటలను, ప్రభుత్వ భూములను
వదలని అక్రమార్కులు
*గత మూడేళ్లుగా ఖాళీ జాగాకు టాక్స్ వసూళ్లు*
*వివరణ కోరితే ఇంటి నెంబర్ను డీ ఆక్టీవ్ చేస్తున్నామంటూ బుకాయింపు*
*ఇంటి నంబర్ల ద్వారా కాలి జాగాకు మేడ్చెల్ ఎస్ ఆర్ ఓ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్స్*
*కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు అనుకూలంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది*
*సర్వే నంబర్ 156 ప్రభుత్వ భూమి, ఈర్లకుంట ఎఫ్ టిఎల్ ఇంటి నంబర్ల కేటాయింపులో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ నేత*
మేడ్చల్, అక్షిత బ్యూరో :
భూ మాఫియా రాజ్యమేలుతుంది. కాసులకు కక్కుర్తిపడి భూములను రాబంధుల వశం చేస్తుండ్రు. కాసులిస్తే దుండిగల్ మున్సిపాలిటీలో కాని పనుండదు. అంతా కాసుల మయం… అధికారులు తలచుకుంటే తిమ్మిని బమ్మిని చేసి భూభకాసులరులకు కట్ట బెడుతుండ్రు. విలువైన భూములన్నీ కబ్జా చెరల్లోకి జారి పోతున్నాయి. కుంటలు, చెరువులు, నాలాలు అన్ని కబ్జాదారుల హస్తాల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వ భూములు, ఆస్తుల పరిరక్షణకు… కబ్జా రాయుళ్ళపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రాలాంటి వ్యవస్థను రేవంత్ సర్కార్ అమలు చేస్తున్నప్పటికీ .. లొసుగులను అదునుగా చేసుకుని కబ్జాలు చేస్తుండ్రు. ఓ బిల్ కలెక్టర్ అంతా తానై నడిపించిండు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఉంది దుండిగల్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పని తీరు. దుండిగల్ మున్సిపాలిటీలో ఇంటి నంబర్ల కేటాయింపులో అధికారులు, సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. బిల్ కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనడానికి నిదర్శనం. మున్సిపల్ పరిధిలోని కాలి జాగాలకు,ఎఫ్ టిఎల్ స్థలాలకు, ఇల్లు లేకున్నా కేవలం ప్రీపెస్ట్ వాలుకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన ఘటన బట్టబయలు అయింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో పట్టా భూములను చూపిస్తూ ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు కేటాయించగా,ఎఫ్ టిఎల్ స్థలాల్లో ఖాలి జాగాలకు అస్సెస్మెంట్ చేసి ఇంటి నంబర్లు కేటాయించడం మున్సిపాలిటీలో సంచలనంగా మారింది. అధికారుల పనితీరుపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూములకు, ఎఫ్ టిఎల్ లోని కాలి జాగాకు ఇంటి నంబర్లు కేటాయింపులో దొమ్మర పోచంపల్లికి చెందిన వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి చక్రం తిప్పగా దొమ్మరపోచంపల్లి వార్డుకు చెందిన ఓ బిల్ కలెక్టర్ ఈ తతంగమంతా అంతా తానే నడిపించినట్లు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు తెలియకుండా ఇంతగా తతంగా జరిగే అవకాశమే ఉండదు. అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా డియాక్టవేషన్ చేస్తాము అంటూ అంటూ బుకయిస్తున్నారు.
కాలి జాగాకు ప్రికాస్ట్ వాల్ కు ఇంటి నంబర్ కేటాయింపు..
దుండగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచంపల్లిలోని లేక్ ఐడి 2831 ఈర్లకుంట విస్తీర్ణం 6.682 ఎకరాలు దొమ్మర పోచంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంట ఎఫ్ టిఎల్ ను ఆక్రమించి గ్రామ గ్రామపంచాయతీ అనుమతితో 5 ఎకరాల్లో వెంచర్ వేయగా అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి,ఎఫ్ టి ఎల్ లో ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ పలకలకు ఇటీవల అస్సెస్మెంట్ చేసి ఇంటి నంబర్లు బిల్ కలెక్టర్ కేటాయించడం విమర్శలకు తావిస్తుంది. ఇదంతా ఒక బిల్ కలెక్టర్గా చేశాడు అంటే అలా కుదరదు కమిషనర్ సంతకం లేనిదే ఇంటి నంబర్లు జారీ అయ్యే ప్రసక్తే లేదు.

ఒక ఇంటి నెంబర్ మున్సిపాలిటీ లో కావాలంటే లింకు డాక్యుమెంట్లో, ఇంటి ఫోటో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయి ఉండాలి అట్టి దరఖాస్తులను మున్సిపల్ రెవెన్యూ మేనేజర్, బిల్ కలెక్టర్ వెళ్లి సైటును సందర్శించిన తర్వాతే ఆన్లైన్ ద్వారా మున్సిపల్ చట్ట ప్రకారం కమిషనర్ సంతకంతో జారి చేయడం జరుగుతుంది. ఇన్ని నిబంధనలో ఉన్న చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని అక్రమార్కులు ఇచ్చే చిల్లర డబ్బులకు లాలూచీ పడి దుండిగల్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ చట్టాన్ని చెత్తబుట్టలో వేసి తమ ఇష్టానుసారంగా ప్రి క్యాస్ట్ వాల్ కు, ఎఫ్ టి ఎల్ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించి మున్సిపల్ చట్టం పరువు తీశారు.
ఇంటి నంబర్లు ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్స్
దొమ్మర పోచంపల్లిలోని పట్టా భూమి సర్వే నంబర్ 158 లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 156 ని కలుపుకొని సుమారు 20 ఎకరాల్లో వెంచర్ వేశారు. లింక్ డాక్యునెంట్స్ లో రెండు సర్వే నంబర్లు ఉండడంతో సర్వే నంబర్ 158 లో ఇంటి నంబర్లు పొందుతున్న నిర్మాణదారులు సర్వే నంబర్ 156 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇంటి నంబర్ ఆధారంగా మేడ్చెల్ ఎస్ ఆర్ ఓ ఆఫీస్ లో ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్స్ పొందుతుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వై రామలింగేశ్వర రావు అనే వ్యక్తికి 4-91/217, 4-91/219, 4-91/220, 4-91/221 ఇంటి నంబర్లు కేటాయించడంతో మున్సిపల్ అధికారుల అవినీతి బట్ట బయలయింది. అధికారుల ఫీల్డ్ విజిట్ చేయకుండానే సర్వేనెంబర్ ఓ చోట ఉండగా, మరోచోట ఉన్న ఇంటికి నెంబర్ ను ఇచ్చారు. అవినీతి బయటపడటంతో అధికారులను వివరణ కోరగా ఎలా ఇచ్చామో అలాగే ఆన్లైన్లో డీయాక్టివేషన్ చేస్తున్నామంటూ బొంకుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం కొన్ని ఇంటి నంబర్లను డియాక్టివేషన్ చేసిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి తిరిగి అదే నంబర్లను ఆక్టివేట్ చేయడం అధికారులు,సిబ్బంది అవినీతి సంపాదనకు అద్దం పడుతుంది. ఈ దారుణాలపై ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు, విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటే, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని సామాన్య ప్రజలు కోరుతున్నారు.