ప్రసన్న ఉన్నత విద్యకు
సుమన్ టివి, హెల్పింగ్ హ్యాండ్
ఇంటర్ నుంచి ఉన్నత విద్య పూర్తికి ఆర్థిక చేయూత
తహశీల్దార్ హేమలత చేతుల మీదుగా ఆర్థిక సహాయం చెక్కును అందించిన సుమన్ టివి యాజమాన్యం
అభినందించిన వేములపల్లి పుర ప్రముఖులు
ప్రసన్న చదువుకు సుమన్ టీవీ అండగా నిలిచింది. ఉన్నత విద్యకు అయ్యే ఖర్చంతా భరిస్తామని భరోసా కల్పించింది. పేదింటి బిడ్డ చదువు అర్థాంతరంగా ఆగకుండా సుమన్ టీవీ తోడైంది. చదువుల తల్లి సంకల్పానికి ఆర్థిక భరోసా లభించింది.
అక్షిత న్యూస్, వేములపల్లి :
పసితనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మ నీడలో పెరిగిన పేదింటి బిడ్డ పుట్టల ప్రసన్న కన్న తల్లిదండ్రుల ప్రేమను పొందలేక పోయినప్పటికి చదువుల తల్లి సరస్వతి దేవి కరుణాకటాక్షంతో ప్రభుత్వ పాఠశాలలో పట్టుదలతో విద్యానభ్యశించి పదవతరగతి పరీక్ష ఫలితాలలో 600గాను 563 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ప్రసన్న పట్టుదల, ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తన సొంత ఖర్చులతో విమానం టికెట్ ఇప్పించి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం విజ్ఞాన విహార యాత్రకు పంపించి ప్రసన్న కోరికను సాకారం చేయడం జరిగింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమైన పుట్టల ప్రసన్నకు సరస్వతి దేవి చేరదీసినప్పటికి ఉన్నత చదువులు చదవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేక ఆర్ధిక ఇబ్బందులతో తనలో తానే మదనపడుతుంది.

ప్రసన్న పరిస్థితిని తెలుసుకున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్థానిక గ్రామ పంచాయితీ తాజా మాజీ వార్డు సభ్యుడు పుట్టల సందీప్ మాదిగ ప్రసన్న కుటుంబ ఆర్థిక పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నివాసి పుట్టల ప్రసాద్ కు వివరించడం జరిగింది. ప్రసన్న పై చదువుల విషయం సుమన్ టీవీ యజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లడంతో చదువులతల్లి పుట్టల ప్రసన్న ఇంటర్మిడియేట్ విద్యతో పాటు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమయ్యే అన్ని రకాల సహాయ సహకారం అందించేందుకు అంగీకరించడం జరిగింది. ఈ మేరకు శనివారం సుమన్ టీవీ యజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ వేములపల్లిలో పుట్టల ప్రసన్నను కలిసి ఆమె ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చెక్కును గ్రామ పుర ప్రముఖుల సమక్షంలో మండల తహసిల్దార్ హేమలత చేతుల మీదుగా విద్యార్థికి అందజేయడం జరిగింది. పేదింటి బిడ్డకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చిన సుమన్ టీవి యాజమాన్యానికి, మేనేజింగ్ డైరెక్టర్, హెల్పింగ్ హ్యాండ్స్ మొబైల్ టీం సభ్యులకు సహకరించిన పుట్టల ప్రసాద్ లకు వేములపల్లి గ్రామప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి బోయినపల్లి రవీందర్, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లు మహేందర్ రెడ్డి, స్పందన, దైద సైదులులతో పాటు ప్రసన్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.