కూల్చిన చోటే
మళ్ళీ కట్టడం
సర్వే నంబర్ 166లో మరో
అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణం..
హైడ్రా కూల్చినా..
ఆగని అక్రమ నిర్మాణాలు..
స్థానిక రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలంటూ విమర్శల వెల్లువ..
మేడ్చల్, అక్షిత బ్యూరో :
అధికారులు… ప్రజా ప్రతినిధుల చలువ ఉంటే
కబ్జాకు అడ్డేముంటుంది. హైడ్రాకు ఆదరడం.. బెదరడం లేదు.రెవిన్యూ అధికారుల కనుసన్నుల్లోనే అక్రమ కట్టడాల నిర్మాణం సాగుతుంది. వత్తిళ్లు వస్తే కూల్చుతాం… మళ్ళీ కట్టుకోండి. తూతూ మంత్రంగా ఏదో కూల్చినట్లు చేస్తాం… మేము అటు వెళ్లగానే మళ్ళీ కట్టుకోండి అంటూ కబ్జా రాయుళ్ళకు రెవిన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. భరోసా ఉంటే… ఇక బరితెగించైనా కట్టుబడి చేస్తాం. అడ్డు వస్తే.. బెదిరిస్తాం అంటూ కబ్జా రాయుళ్ళ తీరు సుస్పష్టం అవుతుంది. అధికారుల సహకారంతొ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి పలు అనుమానాలకు తావిస్తుందని వినికిడి. హైడ్రా అధికారులు ఓ వైపు వరుసగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పటికీ కబ్జాదారులు బరితెగిస్తూ అక్రమనిర్మాణాలు కొనసాగిస్తున్నారు. స్థానిక అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు అక్రమనిర్మాణం అంటూ అధికారులు కూల్చివేయగా కూల్చిన చోట నిర్మాణం జరుగుతున్నా…రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అధికార, ప్రతి పక్ష నాయకులు బౌరంపేట సర్వే నంబర్ 166 లో అనుమతి లేకుండా గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపట్టగా వార్త కథనాల ద్వారా అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేపింది.

దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధి బౌరంపేట లోని సర్వే నంబర్ 166 అసైన్డ్ భూమి 432.19 గుంటలు, సుమారు 50 ఎకరాలు పోలీస్ శాఖకు కేటాయించగా, మరో 50 నుండి 70 ఎకరాల భూమిని 10 మంది ఎక్స్ సర్వీస్ మెన్ లకు కేటాయించారు. మిగిలిన భూమిని స్థానిక రైతులకు లావన్ పట్టాలుగా కేటాయించారు. నిర్మాణాలు చేపట్టాలంటే ఎన్ఓసి తప్పని సరి. ఎన్ఓసి పొందకుండా సుమారు రెండు ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. ఈ క్రమంలో గత 8 నెలల క్రితం మూడువేల గజాల స్థలంలో గెస్ట్ హౌస్, షెడ్డు నిర్మాణం చేపట్టగా స్థానికులు ఫిర్యాదు చేయగా, అప్పట్లో రెవెన్యూ అధికారులు పైపై కూల్చివేతలు చేపట్టారు. కూల్చిన చోట సదరు వ్యక్తి తిరిగి అక్రమ నిర్మాణం చేపడుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సమీప బందువుది కావడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమన్వయ లోపమా..
సహకారమా !
చర్యలు లేనట్టేనా..?
బౌరంపేట సర్వే నంబర్ 166 ఆర్ఎంసి ప్లాంట్ సమీపంలో జరుగుతున్న అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణంపై అధికారులను వివరణ కోరగా గెస్ట్ హౌస్ నిర్మాణం అసైన్డ్ భూమిలో అంటూ మున్సిపల్, బహుళ అంతస్తులపై చర్యలు మున్సిపల్ అధికారులదే అంటూ రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్న తీరు పలు విమర్శలకు తావిస్తుంది. బిఆర్ఎస్ ప్రజాప్రతినిధి సమీప బందువుది కావడంతోనే అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అక్రమ కట్టడాలకు కళ్ళెం వేస్తారా? కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారుడికి అండగా నిలుస్తారో? వేచి చూడాల్సిందే.