పాఠశాలల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

పాఠశాలల పరిశుభ్రతపై
ప్రత్యేక దృష్టి సారించాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

పాఠశాలల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.గురువారం ఆమె పాఠశాలల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలు, తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాఠశాలలు పునః ప్రారంభం కావడం ,అలాగే వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా పాఠశాలల్లో
పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి జిల్లాలోని అన్ని పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలు ,హాస్టళ్లలో పరిశుభ్రత లోపం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల గదులు, ఆవరణ, వంటగది, టాయ్లెట్లు అన్ని శుభ్రంగా ఉంచాలని,పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, ఎక్కడైనా వాననీరు నిలిచి ఉండేందుకు ఆస్కారం ఉంటే గుర్తించి తక్షణమే సులభంగా వాన నీరు వెళ్లే మార్గం చేయాలని, అన్ని పాఠశాలల్లో టాయిలెట్లుశుభ్రంగా ఉండేలా చూడాలని, మురుగు నీరు సులభంగా మురికి కాలువలోకి వెళ్లేలా చూడాలని చెప్పారు. విద్యార్థులు పాము,తేలు కాటుకు గురికాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో బ్లీచింగ్ పౌడర్ తో పాటు, గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ను ఆదేశించారు. రెండు వారాలలో వీటన్నింటిని పూర్తి చేయాలని అన్నారు. కేవలం విద్యాశాఖ ద్వారా మాత్రమే ఈ పనులన్నీ చేయడం కష్టమని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత విషయమై మండల ప్రత్యేక అధికారులు తక్షణమే వారి పరిధిలో సమావేశాలు నిర్వహించాలని ,అలాగే అన్ని పాఠశాలలు ,హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను
తనిఖీ చేయాలని, ఎక్కడైనా వర్షం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా పాము ,తేలు కాటు వంటివాటికి గురైతే సంబంధిత ఎంఎస్ ఓ ,ఎం పి ఓ, పంచాయతీ కార్యదర్శులకు షో కాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రత్యేక అధికారులు పాఠశాలలు, హాస్టళ్లలో బస చేయాలని, మహిళాధికారులు బాలికల పాఠశాలల్లో బస చేయాలని, పాఠశాల పరిశుభ్రతలో ఎంపీడీవోలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కడా పాడైపోయిన బియ్యం, కూరగాయలతో భోజనాన్ని తయారు చేయవద్దని, వంటగదిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే
పాఠశాలలోని అన్ని మూత్రశాలలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్,
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ , రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
ఎమ్ఎస్ వోలు, ఇతర అధికారులు,
తదితరులు, ఈ టెలీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking