ఆరోగ్య సమాజానికి యోగా అద్భుత మార్గం
-మాజీ ఎంపీ నామ
-భారతీయ సంస్కృతికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన యోగా
ఖమ్మం /అక్షిత బ్యూరో :
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. యోగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని శారీరకంగా మరియు మానసికంగా సమతుల్యం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రోజువారీ జీవనశైలిలో యోగాసనాలు ధ్యానం శ్వాసాభ్యాసాలను అనుసరించడం ద్వారా ఒత్తిడి ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుందని వివరించారు.యోగా వ్యక్తిత్వ వికాసానికి లోతైన ఆలోచనశక్తి పెంపునకు శాంతి సౌఖ్యం ఐక్యతను అందించే శక్తిమంతమైన సాధనమని అభివర్ణించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాలు యోగా చేయాలని సూచించారు. యువత దీన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన దినచర్యలో భాగంగా ప్రతి రోజు యోగా చేస్తానని నామ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో చైతన్యం పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో యోగా కార్యక్రమాలను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని నామ ఆకాంక్షించారు.