భూ కబ్జాదారునిపై కేసు నమోదు
వేలేకరులను అసభ్య పదజాలంతో దూషించడంతో డిసిపి కోటిరెడ్డికి ఫిర్యాదు
డిసిపి ఆదేశాలతో కేసు నమోదు చేసిన దుండిగల్ సిఐ సతీష్
రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా గెస్ట్ హౌస్ నిర్మాణం
నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ అధికారులు తీరు
“బాబు” తీరు మార్చుకో
మేడ్చల్,అక్షిత బ్యూరో :
కబ్జా దారుల ఆగడాలు మితి మీరాయి. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు .. విలాస వంతమైన భవంతులు నిర్మించడం.. అది గుడా, బడా అనే సంబంధం కూడా లేకుండా కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఎవరైనా ఆక్షేపిస్తే దూషణలు, దాడులకు దిగడం. ఉన్నది ఉన్నట్లు… ఉండదు కనికట్టులా…కబ్జాలు, అక్రమాలపై అక్షర దండోరా మోగిస్తే… కబ్జా దారుల నుంచి బెదిరింపులు. ఇదేం తీరు… కబ్జాల బాబు. పేదల భూములు, ప్రభుత్వ భూములపై కన్నం వేసి కబ్జాలు చేయడం… పత్రికల్లో రాస్తే… వాళ్లను బెదిరించడం సరైంది కాదు. పద్దతి మార్చుకో… లేకుంటే తగు రీతిలో పర్యవసానం చవి చూడక తప్పదు.

వర్కింగ్ జర్నలిస్ట్ ను అసభ్య పదజాలంతో దూషించిన సంఘటనలో ఓ భూ కబ్జాదారునిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.ఈ నెల 25న అక్షిత దినపత్రికతో పాటు పలు దిన పత్రికల్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన గెస్ట్ నిర్మాణంపై ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అదే రోజు ఓ దిన పత్రిక విలేకరిని ( అక్షిత జాతీయ దిన పత్రిక విలేకరిని కాదు) అసభ్య పదజాలంతో దూషించడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటనతో భగ్గుమన్న తోటి విలేకరులు మంగళవారం మేడ్చెల్ డిసిపి కోటిరెడ్డిని కలిసి వీడియో ఆధారంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన డిసిపి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ దుండిగల్ సిఐ సతీష్ కు ఆదేశాలు జారీచేశాడు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 26న క్రైం నంబర్.636…కింద కేసు నమోదు చేసినట్లు దుండిగల్ సిఐ పి.సతీష్ తెలిపాడు. సామాన్యులు 60 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే హడావుడి చేస్తూ సామాన్యులపై కేసులు నమోదు చేస్తున్న రెవెన్యూ అధికారులు ధన బల, అధికార బలంతో భూ కబ్జాదారులు కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భూ కబ్జాలకు పాల్పడుతూ రెచ్చుపోతున్న సదరు భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బౌరంపేటకు చెందిన ఆకుల బాబు సర్వే నంబర్ 166/15 లోని రెండు ఏకరాల ప్రభుత్వ స్తలాన్ని ఆక్రమించి దర్జాగా అనుభవిస్తున్న ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు భూ కబ్జాదారునిపై బాచుపల్లి పోలీష్ స్టేషన్ లో సైతం కేసు నమోదైనట్లు సమాచారం.