బీజేపీ తెలంగాణ అధ్యక్షులుగా రాంచందర్ రావు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచందర్ రావు పేరు ఖరారు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

విద్యార్ధి దశలోనే ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు.అందరినీ కలుపుకుపోతారని ఆయనకు పేరుంది. ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎం.ఏ (1980–82), ఎల్‌.ఎల్‌.బీ (1982–85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977–85), నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యూనల్స్‌లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా (1980–82), నగర ఉపాధ్యక్షుడిగా (1986–90) పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ (1999–2003), కన్వీనర్ (2003–06)గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ (2006–10), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007–09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009–12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012–15) పనిచేశారు. 2015లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.

కుటుంబ నేపథ్యం 

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు స్వగ్రామం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం. ఇది తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామం. ఈ గ్రామంకు ఆంధ్రకు మధ్య పాలేరువాగు మాత్రమే అడ్డం. రాంచందర్ రావు అమ్మమ్మ ఊరు కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రం. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు స్వగ్రామం కూడా అనంతగిరినే. రాంచందర్ రావుకు కోదాడలోని పిల్లల డాక్టర్ రాఘవరావు స్వంత పెదనాన్న కొడుకు. రాంచందర్ రావు తండ్రి NVR లక్ష్మి నారాయణరావు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. తన జీవితకాలంలో ఒక్కనిమిషం కూడా కళాశాలకు, తరగతి గదికి ఆలస్యంగా రాని ప్రొఫెసర్ గా ఈయన పేరు గాంచారు.
అలాగే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి రాంచందర్ రావు వియ్యంకుడు. రాంచందర్ రావు కుమార్తె సంతోష్ రెడ్డి కుమారునిది ప్రేమ వివాహం.రాంచందర్ రావుకు కూకట్పల్లి JNTU మాజీ రిజిస్ట్రార్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు స్వంత తమ్ముడు. ఈయన వరంగల్ NIT డైరక్టర్ గా చేసి పదవీ విరమణ పొందగా extension ఇచ్చి రాయపూర్ NIT డైరక్టర్ గా నియమించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి NIT కి ఇంచార్జ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రాంచందర్ రావు విద్యార్థి దశ నుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా 1980-85 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ABVP నాయకునిగా ఇంగ్లీష్, హిందీ భాషలలో మంచి వక్తగా గణతికెక్కారు. లా కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో విద్యార్దిగా ఉన్నారు. ఆ తరువాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ కార్యకర్తగా నాయకునిగా పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే సీనియర్ లాయర్ అయ్యారు.ఒక్కసారి పరిచయమై పదేళ్ల తరువాత కనిపించినా తడుముకోకుండా పేరుపేట్టి పిలువగల అపారమైన జ్ఞాపకశక్తి రాంచందర్ రావుకు ఉన్న గొప్ప సంపద.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking