శభాష్ పోలీస్…

*శభాష్ పోలీస్
ఎస్ఐ రవీందర్ ధైర్య సాహసాలు భేష్

ముసీనదిలో గల్లంతైన
సుస్మిత మృతదేహం లభ్యం

నేరేడుచర్ల ఎస్ఐ
రవీందర్ కృషి అమోఘం

బాలిక మృతదేహాన్ని కుటుంబ
సభ్యులకు అప్పగింత

ఎస్ఐపై ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు, నెటిజెన్లు

నేరేడుచర్ల, అక్షిత న్యూస్ :

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల
మండలం సోమవరం గ్రామానికి చెందిన కొమర్రాజు సుస్మిత(13) శనివారం మూసీ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుస్మిత ఆచూకీ కోసం రాత్రి 8 గంటల వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న ముసీ నదిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది.దీనితో బాలిక తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.నది ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైన బాలిక మరణించే ఉంటుందని అంచనాకు వచ్చారు.కానీ,మూసీ నది నీటి ప్రవాహ స్థితిని చూసి మృతదేహం లభ్యం అవుతుందా లేదా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. బాలిక తల్లిదండ్రులు తమ కూతురు ప్రాణాలతో లేకున్నా కనీసం చివరిచూపు కోసం మృతదేహాన్నైనా అప్పగించాలంటూ ఎస్ఐ రవీందర్ ను ప్రాధేయపడగా, బిడ్డ కోసం తల్లిదండ్రులు పడుతున్న వేదనను గుర్తించిన ఆయన ఆదివారం ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు చేపట్టారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో మూసీ అవతలి వడ్డున మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.కానీ,నది ఉధృతికి ఇవతలి వడ్డుకు తీసుకురావడానికి పరిస్థితి ప్రతికూలంగా మారింది.ఏ మాత్రం బెడిసికొట్టినా మృతదేహం మళ్లీ నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన ఎస్ఐ రవీందర్, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ తాడును తీసుకొని స్వయంగా ఈత కొడుతూ మృతదేహం ఉన్న నది అవతల ఒడ్డుకు చేరుకుని, అక్కడున్న వ్యక్తుల సహాయంతో తెప్పపై బాలిక మృతదేహాన్ని భద్రపరిచి ఇవతల ఉన్న వారి సహాయంతో రెస్క్యూ చేసి ఒడ్డుకు చేర్చారు. సుస్మిత మృతదేహాన్ని గుర్తించారని సమాచారం అందడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు.బాలిక మృతదేహం కోసం ఎస్ఐ రవీందర్ స్వయంగా ఈతపై అవతల ఒడ్డుకు వెళ్లి మృతదేహాన్ని తీసుకు వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనించిన స్థానికులు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.దీనితో ఎస్ఐ రవీందర్ ధైర్య సాహసాలను కొనియాడుతూ శభాష్ పోలీస్, ఎస్ఐ రవీందర్ కృషి భేష్, నిజమైన పోలీస్, హ్యాట్సాఫ్ ఎస్ఐ రవీందర్ సాబ్ అంటూ స్థానికులు,నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking