పుస్తకం మనిషికి మౌన గురువు

*పుస్తకం మనిషికి మౌన గురువు*

*-TUWJ రాష్ట్ర అధ్యక్షులు* *విరాహత్ అలీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

మనిషికి మంచి గుణాలు నేర్పే మౌన గురువు పుస్తకమేనని, పుస్తకం చదవడమంటే కొత్త ప్రపంచాన్ని అనుభవించడమేనని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు.
ఆదివారం నాడు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గల సేంట్ మేరీస్ ఉన్నత పాఠశాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా “ఇంటింటా గ్రంథాలయం” అనే వినూత్న కార్యక్రమం ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాల్యం నుండే పుస్తకాలు చదివే అలవాటు కలిగి ఉన్న తాను, ఆ పుస్తకాలు అందించిన జ్ఞానంతోనే ఇవ్వాళ్టి సభలో నిర్భయంగా మాట్లాడ గలుగుతున్నానని విరాహత్ అలీ స్పష్టం చేసారు.

జీవితంలో మనకు సరైన మార్గం చూపే నిజమైన స్నేహితుడు పుస్తకమేనని ఆయన అన్నారు. నేటి సమాజంలో సాంకేతిక పోకడలతో పుస్తకాలకు విలువ లేకుండా పోతుందని, చారిత్రాత్మక ఎన్నో గ్రంథాలయాలు నేడు నిరాధరణకు గురవ్వడం విచారకరమన్నారు.

ఈ క్రమంలోనే పుస్తకాలకు పఠనకు పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్న సేంట్ మేరీ పాఠశాల యాజమాన్యాన్ని విరాహత్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, గజ్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, పాఠశాల కరస్పాండెంట్ ఇన్నారెడ్డితో పాటు విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking