అంబేద్కర్ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం – కలెక్టర్ పిలుపు
ఘనంగా డా. బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అక్షిత బ్యూరో :
మంగళవారం, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి మునిసిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డా. బి. ఆర్. అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య, సామాజిక చైతన్యం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.అనంతరం ఏసిపి పండరి చేతన్ నితిన్, ఆర్డీఓ గోపీరాం, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులముల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు కూడా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అంజలి ఘటించి, నివాళులు అర్పించారు.