*కోమటిరెడ్డిపై ‘తుంగతుర్తి’ తిరుగుబాటు! ఎమ్మెల్యే సామేలు*
• మంత్రి వెంకటరెడ్డికి ‘మెంటల్’ ఎక్కిందంటూ ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు
• నా నియోజకవర్గానికి వస్తూ ప్రోటోకాల్ పాటించరా? కనీస సమాచారం ఇవ్వరా?
• రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం.. అధిష్టానానికి, సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేస్తా!
• మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం: తీవ్ర హెచ్చరిక
తిరుమలగిరి, అక్షిత ప్రతినిధి:
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్ష్యంగా తుంగతుర్తి కాంగ్రెస్ శాసనసభ్యులు మందుల సామేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డిపై అత్యంత ఘాటైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ‘మెంటల్’ ఎక్కిందని, ఆయన ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి పర్యటనలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
• సమస్యలు పట్టించుకోరు.. పర్యటనలు చేస్తారు!
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రహదారుల దుస్థితిపై, పెండింగ్ పనులపై రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తాను ఎన్నిసార్లు విన్నవించినా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే సామేలు ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టి, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించడమే ధ్యేయంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి పర్యటనల గురించి కనీసం సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనన్నారు. మంత్రి కోమటిరెడ్డితో పాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి కూడా పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోందని ఈ సందర్భంగా తప్పుబట్టారు.
• మాదిగల జోలికొస్తే రాజకీయ సమాధే!
దళిత, ఎస్సీ నియోజకవర్గాలన్నా, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గమన్నా మంత్రి కోమటిరెడ్డికి తీవ్రమైన చిన్నచూపు, వివక్ష ఉన్నాయని ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. “మాదిగలు ఎవరికీ బానిసలు కారు.. మాకు ఆత్మగౌరవం ఉంది. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. మా జోలికి వస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొట్టడం ఖాయం” అంటూ మంత్రి కోమటిరెడ్డికి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.అధిష్టానం గడపకు ‘ప్రోటోకాల్’ రగడ..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై తాను ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సామేలు స్పష్టం చేశారు. ఈ పర్యటనల వ్యవహారంపై, నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానంతో పాటు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షునికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. స్వంత పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల మధ్య తిరుమలగిరి వేదికగా చెలరేగిన ఈ అంతర్గత విభేదాలు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సమావేశంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మీ లాల్ నాయక్, కౌన్సిలర్లు తిరుమణి యాదగిరి, బత్తుల శ్రీనివాస్, కందుకూరి లక్ష్మయ్య, ఉప్పలయ్య, పత్తి పురం సుధాకర్, పాలెపు చంద్రశేఖర్, యువ నాయకుడు పిఎన్ఆర్ నరేష్, నియోజవర్గంలో మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.