భువనగిరి అర్బన్ హెల్త్ సెంటర్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డాక్టర్లు మరియు సిబ్బంది హాజరు వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు.ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి ప్రతిరోజు వచ్చే పేషెంట్ల సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి, వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది తమను సక్రమంగా చూసుకుంటున్నారా అని ప్రశ్నించారు.అవసరమైన మందులు సరిపడా నిల్వలో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
