రహదారి భద్రత – అందరి బాధ్యత.
– మంత్రి పొన్నం ప్రభాకర్.
– ఆదిలాబాద్‌లో ఘనంగా రహదారి భద్రత అవగాహన కార్యక్రమం.
– విద్యార్థులతో భారీ మానవహారం.
– బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి.
అక్షిత ప్రతినిధి/ అదిలాబాద్ :
హదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని, అది మన ప్రాణాలకు రక్షణ కవచమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన అరైవ్ అలైవ్, రహదారి భద్రత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలపై సమాజంలో అవగాహనా పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. దేశంలో సహజ మరణాల కంటే, రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువగా ఉండటం అత్యంత ఆవేదన కలిగించే అంశమని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, రహదారుల నిర్మాణం, లోపాల సవరణ, నిబంధనల కఠినంగా అమలు చేయడం, ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయాణం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. యువత వేగాన్ని నియంత్రించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం ఆత్మహత్యతో సమానమని అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే పోలీసు, రవాణా శాఖల కృషి ఫలిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు స్టేడియం మైదానంలో పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి ‘హెల్మెట్ – సేవ్ లైవ్స్ ఆకారంలో భారీ మానవహారాన్ని నిర్వహించారు. విద్యార్థులు రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం యువతకు లెర్నింగ్ లైసెన్స్‌లను, డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలను మంత్రి పంపిణీ చేశారు.అనంతరం మంత్రి స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించడమే కాకుండా, స్వయంగా పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం అంబెడ్కర్ చౌక్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వాహనదారులకు హెల్మెట్లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజు మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి. రవీందర్ కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

