దక్షిణాదికి అన్యాయం జరగనివ్వద్దు

దక్షిణాదికి అన్యాయం జరగనివ్వద్దు

డీలిమిటేషన్ పద్ధతి మారాలి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

జనాభా కాదు.. జీఎస్టీనే ప్రాతిపదిక కావాలి

జమిలీ ఎన్నికలపై స్పష్టత, రాష్ట్రాల విభజనపై విశ్లేషణ బీఆర్ఎస్ ‘ఆత్మ విమర్శ’ చేసుకోవాలి

రాజకీయాల్లో పెరిగిన ధన ప్రవాహం

కాలువల విస్తరణే రైతులకు శ్రీరామరక్ష

ఏఎమ్మార్పీ నీటి సామర్థ్యం 4000 క్యూసెక్కులకు పెంచాలి

లైనింగ్కు ముందే కాలువలు వెడల్పు చేయాలని డిమాండ్

తెలంగాణ.. వలస కూలీల అడ్డా

రాష్ట్రంలో 20 లక్షల మంది ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి లభిస్తోందని వెల్లడి

ఉమ్మడి నల్గొండ అక్షిత బ్యూరో

 

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నల్గొండలో. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.” దేశ రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, సాగునీటి రంగంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపాదనలు డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని గుత్తా పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సీట్లను 50 శాతం పెంచేలా కేంద్రం ప్రతిపాదిస్తోందని, అయితే 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ ప్రాతిపదికన విభజన జరగాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును విడివిడిగా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

రాజకీయాలు – జమిలీ ఎన్నికలు….

ఒకే దేశం-ఒకే ఎన్నికలు అమలైతే, దేశంలోని 18 రాష్ట్రాలు ఒక విడతలో, మిగిలిన రాష్ట్రాలు మరో విడతలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టకుంటే సామాన్యుడు రాజకీయాల్లో పోటీ చేసే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార పార్టీలో అసంతృప్తి సహజమని వ్యాఖ్యానిస్తూనే, బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మారుస్తారన్న ప్రచారంపై స్పందించారు. పార్టీ పేరు మార్పుపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

రైతాంగ సమస్యలు….

ధాన్యం సేకరణపై స్పష్టతనిస్తూ, ప్రస్తుతం సన్నధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం 80 శాతం రా రైస్ అడుగుతుంటే, మిల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్ కే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా వేసవి కాలంలో రా రైస్ సేకరిస్తే నూక శాతం ఎక్కువగా వస్తుందని వివరించారు. సిఎంఆర్ ధాన్యం సేకరణలో పూర్తి నియంత్రణ ఉండాలని, అయితే మిల్లులను మూసివేసే పరిస్థితి లేదని.. ఒకవేళ మిల్లులు మూతపడితే ధాన్యం కొనేవారే ఉండరని గుర్తుచేశారు.

సాగనీటి కాలువల విస్తరణ…

నల్గొండ జిల్లా ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి వ్యవస్థపై ఆయన కీలక సూచనలు చేశారు. ఏఎమ్మార్పీ ప్రస్తుతం 2400 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, దీనిని 4000 క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి కాలువలకు లైనింగ్ పనులు చేపట్టే ముందే వాటి విస్తరణ పూర్తి చేయాలని, దీనివల్ల రైతులకు చిట్టచివరి భూములకు కూడా నీరందుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సుమారు 20 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి గుత్తా రీ-ఎంట్రీ అసెంబ్లీ లేదా పార్లమెంట్కు పోటీ సిద్ధం.!

రాజకీయ కురువృద్దుడు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన వారసుడు అమిత్ రెడ్డిని బరిలోకి దింపుతానని చెప్పిన ఆయన, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వృథా పోనివ్వనని గుత్తా స్పష్టం చేశారు. “రాజకీయాల్లోకి వస్తున్న కొత్త తరాన్ని సన్మార్గంలో నడిపించాలంటే నా లాంటి అనుభవజ్ఞల అవసరం ఎంతో ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కొత్త తరం ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారు వక్రమార్గంలో వెళ్లకుండా ‘బ్రేక్ లు’ వేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

పీవీ, నీలం సంజీవరెడ్డిలే స్ఫూర్తి

రాజకీయాల నుంచి విరమించుకుందామనుకున్న తరుణంలో కీలక పదవులు వరించిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిలను ఆయన ఉదహరించారు. పీవీ ప్రధాని కావడం వల్లే దేశంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయని, అదే బాటలో తాను కూడా ప్రజా సేవలో కొనసాగుతానని సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది నవంబర్లో గుత్తా ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఈ లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా ఆరు నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవలని ఆశిస్తున్నారు. నకిరేకల్, నల్గొండ లేదా మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మార్పులు జరిగితే తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking