కెఎన్ఎం 12510 రకం వరి ధాన్యం కొనుగోలు చేయం

కెఎన్ఎం 12510 రకం వరి

 ధాన్యం కొనుగోలు చేయం

వ్యవసాయ శాఖ ఆమోదం
లేని 12510 రకం బియ్యాన్ని వినియోగదారులు ఇష్టపడడం లేదు

జెఎస్ఆర్, జైశ్రీరామ్, హెచ్ఎంటి, చింట్లు రకం ధాన్యానికే ఆదరణ

అవి సాగు చేస్తే మేలు

*రైతాంగం సహకరించాలి

*మిల్లర్స్ అసోసియేషన్ నేతలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వ్యవసాయ శాఖ ఆమోదం లేని కెఎన్ఎం 12510 రకం వరి వంగడాన్ని ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేయొద్దని, కొనుగోలు చేయలేమని, రైతులు గమనించి సహకరించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ లు తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తక్కువ కాలంలో అధిక దిగుబడి వస్తుందని ఆశతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు కొత్తగా వచ్చిన కేఎన్ఎం వరి వంగడాలను సాగు చేస్తున్నారన్నారు. పొట్టిగా అధిక నూకలు ఉన్న ఈ రకం ధాన్యాన్ని ఇతర రకాల ధాన్యంతో కలిపి బాయిల్డ్ చేసినట్లయితే బియ్యంగా మారి అన్నం సరిగా ఉడకడం లేదని, అన్నం గంజి, ముద్దగా మారుతుందన్నారు. ఈ రకం బియ్యంలో వైట్ బెల్ట్ ఎక్కువగా ఉంటుందని, వినియోగదారులు బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ధర తగ్గించి బియ్యం అమ్మిన వినియోగదారులు కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యం పంటకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీ కూడిన రైస్ మిల్లులు అందుబాటులో ఉన్నాయని కేఎన్ఎం లాంటి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం చేత సూపర్ ఫైన్ రకం కింద బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని వివరించారు. సూపర్ ఫైన్ రకాలు అయిన జై శ్రీరామ్ , జెఎస్ఆర్, హెచ్ఎంటి, చింట్లు, పూజ వంటి సూపర్ ఫైన్ రకాలకు మంచి ఆదరణ ఉందన్నారు. ఆరకాల విత్తనాలను రైతులు సాగు చేయాలని రైస్ మిల్లర్లు కోరారు. కేఎన్ఎం 12510 రకం విత్తనాలను ప్రభుత్వం ఇప్పటివరకు సర్టిఫై చేయలేదని రైతులు అర్థం చేసుకొని వరిసాగు చేయవద్దని, బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయించాలంటే సూపర్ ఫైన్ రకం బియ్యం కంటే వెయ్యి రూపాయలకు పైగా తక్కువకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రభుత్వం గుర్తించిన, వ్యవసాయ శాఖ ఆమోదమున్న జెఎస్ఆర్, జై శ్రీరామ్, హెచ్ఎంటి, చింట్లు రకం వరి వంగడాలను మాత్రమే సాగు చేసి రైతులు మిల్లర్లకు సహకరించాలన్నారు. వానాకాలం నాణ్యత కలిగిన సూపర్ ఫైన్ రకం వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని రైతులు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకొని రైస్ మిల్లర్లకు సహకరించాలన్నారు. ఈలోగా కేఎన్ఎం వరి విత్తనాలు కొనుగోలు చేస్తే మార్పిడి చేసుకొని సూపర్ ఫైన్ రకాలైన జైశ్రీరామ్, చింటు, హెచ్ఎంటి, పూజా వరి వంగడాలు సాగు చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా నార్లు పోసే ముందే రైతులకు తెలియజేస్తున్నామని, ఎట్టి పరిస్థితులలో కేఎన్ఎం 12510 రకం వరి సాగు చేయరాదని రైస్ మిల్లర్లు పేర్కొన్నారు. సమావేశంలో రైతు మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షులు గోళ్ళ రామ శేఖర్, కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, రైస్ మిల్లర్స్ జిల్లా నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, మిల్లర్లు రేపాల అంతయ్య, ఇనుగుర్తి మోహన్ రావు, జయిని మురళి, గుడుగుంట్ల గణేష్, గార్లపాటి మధు, గార్లపాటి మట్టపల్లి, గుంటి గోపి, ఇల్లందుల లక్ష్మయ్యలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking